ఐపీఎల్ ముగిసిన నాలుగు రోజులకే టీమిండియా అంతర్జాతీయ క్రికెట్ తో బిజీ కానుంది. దీనిలో భాగంగా ఆప్ఘనిస్థాన్ తో స్వదేశంలో ఒక టెస్ట్, మూడు వన్డేల సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఐపీఎల్ లో సత్తా చాటిన పలువురు యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. రెండు ఫార్మాట్ లలోనూ గిల్ సారథ్యం వహించనుండగా.. టెస్ట్ టీమ్ వైస్ కెప్టెన్సీపై సెలక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. రిషబ్ పంత్ ను తప్పించి కేఎల్ రాహుల్ ను గిల్ కు డిప్యూటీగా నియమించారు. పంత్ పేలవ ఫామ్ తో సతమతమవుతుండడమే ఈ మార్పుకు కారణంగా భావిస్తున్నారు. కాగా ఆప్ఘనిస్థాన్ తో జరగబోయే ఈ టెస్ట్ డబ్ల్యూటీసీలో భాగం కాకపోవడంతో పలు మార్పులు చేసారు.
వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ దృష్ట్యా స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చారు. దీంతో సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణలతో పాటు యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఎంపికయ్యారు. టెస్ట్ జట్టులో పంత్ కు బ్యాకప్ కీపర్ గా జురెల్ చోటు నిలుపుకున్నాడు. కాగా మహ్మద్ షమీని సెలక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో సిరాజ్ కు చోటు దక్కలేదు. కొత్తగా ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేలకు చోటు లభించింది.బ్యాటింగ్ లో చూసుకుంటే రోహిత్ శర్మ, హార్థిక్ పాండ్యాలకు చోటు కల్పించినా ఫిట్ నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
వన్డే జట్టు వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. కాగా టెస్ట్ జట్టు నుంచి జడేజాకు విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు వన్డే టీంకు సంజూ శాంసన్, జైస్వాల్ లను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యపరిచింది. అలాగే ఐపీఎల్ లో సత్తా చాటుతున్న వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్ ముల్లాన్ పూర్ వేదికగా జూన్ 6 నుంచి 10 వరకూ జరుగుతుంది. తర్వాత మూడు వన్డేల సిరీస్ జూన్ 14 నుంచి మొదలవుతుంది. వన్డే సిరీస్ కు ధర్మశాల, లక్నో, చెన్నై ఆతిథ్యమివ్వనున్నాయి.