ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు.. ఒక బైక్.. ఒక గన్.. కొన్ని బుల్లెట్స్. అచ్చంగా స్పై థ్రిల్లర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్‌లానే.. అలా వచ్చి ఇలా టార్గెట్ ఫినిష్ చేసేసి వెళ్లిపోతారు. మిషన్ అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. అలా టార్గెట్ చేసుకున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇంపాజిబుల్. పోలీసులకు డెడ్‌బాడీ తప్ప ఎలాంటి 'క్లూ' ఉండదు. కనీసం బుల్లెట్ షెల్స్ కూడా దొరకవు. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టే పాకిస్తాన్‌లో అంత మంది భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు కుక్కచావు చచ్చారు. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లోనే తాజాగా మరో వికెట్ పడిపోయింది. పుల్వామా దాడి మాస్టర్‌మైండ్‌ను అతడి అడ్డాలోనే అంతం చేశారు. ఈ ఆపరేషన్ కూడా సేమ్ ప్యాట్రన్‌లో జరిగింది. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం..
అర్జుమండ్ గుల్జార్ దార్ అలియాస్ హంజా బుర్హాన్..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ధురంధర్ల చేతిలో హతమైన ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇతడే. పాకిస్తాన్ మద్దతుతో నడుస్తున్న ఉగ్ర గ్రూపు అల్-బదర్‌కు చెందిన టాక్ కమాండర్ ఇతడు. భారత్‌పై నిలువెల్లా విషం నింపుకున్న నరరూప రాక్షసుడు. పుల్వామా ఉగ్రదాడి సమయంలో పాకిస్తానీ ఉగ్రవాదులకు అన్ని విధాలుగా సహాయపడిన కిరాతకుడు. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని అజ్ఞాత వ్యక్తులు ఈ రాక్షసుడి కథ ముగించేశారు. అది కూడా సేమ్ ప్యాట్రన్‌లోనే. విదేశీ నిధుల పంపిణీకి సంబంధించిన వివాదాల కారణంగా పీవోకేలో అల్-బదర్ ముఠాల మధ్య తీవ్రమైన అంతర్గత యుద్ధం నడిచింది. ఈ ముఠా గొడవల్లో జరిగిన కాల్పుల్లో బుర్హాన్ హతమయ్యాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. కానీ, అతడి హత్య జరిగిన తీరు మాత్రం ఆపరేషన్ ధురంధర్‌ను తలపిస్తోంది. అందుకే, పాకిస్తాన్‌లో మరోసారి మిషన్ ధురంధర్ రీసౌండ్ ఇస్తోంది.
దేశ చరిత్రలో బ్లాక్ డేగా మిగిలిపోయిన 2019 పుల్వామా ఉగ్రదాడిలో హంజా బుర్హాన్ పాత్ర అత్యంత కీలకమైనది. నాడు జైషే మహమ్మద్ ఉగ్రవాది అదిల్ అహ్మద్ దార్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘాతుకానికి వెనుక ఉండి నెట్‌వర్క్‌ను నడిపించడంలో, ఉగ్రవాదులకు అవసరమైన రవాణా, ఇతర వసతులు సమకూర్చడంలో హంజా బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు గుర్తించాయి. అతడి వినాశకర కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం, 2022లోనే బుర్హాన్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. కశ్మీర్ లోయలో అల్-బదర్ ఉగ్రవాద సంస్థను బలోపేతం చేయడానికి, భారత్‌కు వ్యతిరేకంగా యువతను రెచ్చగొట్టడానికి బుర్హాన్ ఒక పెద్ద నెట్‌వర్క్‌ను నడిపించేవాడు. ఈ మోస్ట్ వాంటెడ్‌కు నేరుగా ఐఎస్ఐతో సంబంధాలున్నాయని తేలింది.
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఖర్ ప్రాంతానికి చెందిన హంజా మొదట అల్ బదర్ ఉగ్రసంస్థలో చేరాడు.
తర్వాత అల్ బరాక్ అనే మరో ఉగ్రవాద నెట్‌వర్క్‌లో చేరి ఐఎస్‌ఐ మద్దతుతో కార్యకలాపాలు కొనసాగించినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. హంజా ప్రస్తుతం ముజఫరాబాద్ పరిసర ప్రాంతమైన చీలా బండి ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడికి ఎనిమిది మంది కమాండోలు భద్రతగా ఉండటంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎస్కార్ట్ వాహనాలు కూడా కేటాయించినట్లు వర్గాలు చెబుతున్నాయి. అతనికి పాక్ ప్రభుత్వ స్థాయిలోనే రక్షణ కల్పించినట్లు భారత భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. 2026 ప్రారంభంలో హంజా బుర్హాన్‌పై దాడి జరిగింది. దీంతో అతడకి అదనపు భద్రత కల్పించారు. కశ్మీర్ లోయలో చొరబాట్లు, ఉగ్రవాద కార్యకలాపాల సమన్వయంలో హంజా కీలకంగా వ్యవహరించాడు. అలాంటివాడు ఎట్టకేలకు అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమయ్యాడు.
నిజానికి.. హంజా ఒక్కడే కాదు.. గడిచిన ఐదేళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఇలాగే కుక్కచావు చచ్చారు. వారందరూ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్లే. మనం దేశంలో రక్తపాతం సృష్టించిన ఎన్నో ఉగ్రఘటనల్లో సూత్రధాలు, పాత్రధారులే. కానీ, వాళ్లలో ఒక్కడు కూడా ప్రాణాలతో లేడు. ఐఎస్ఐ తిరుగులేని భద్రతా వలయాన్ని ఛేదించి మరీ వారిని అంతంచేశారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ ఇలా పాకిస్తాన్‌లో ఏ నగరంలో ఉన్నా.. ఆఖరికి పాతాళంలో దాక్కొన్నా వెతికి వెంటాడి మరీ లేపేశారు. జస్ట్ ఇద్దరు వ్యక్తులు ఒక బైక్‌పై వస్తారు.. టార్గెట్‌కు పాయింట్ బ్లాంక్‌లో బుల్లెట్ దించేస్తారు. తర్వాత బుల్లెట్ షెల్స్ కూడా క్రైమ్ సీన్‌లో కనిపించవు. అందుకే, ఈ ఆపరేషన్ ఐదేళ్లకుపైగా కొనసాగుతున్నా.. మిస్టరీని ఛేదించలేకపోయింది ఐఎస్ఐ. హంజా విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుంది.