ఎవడ్రా నువ్వు.. ఇలా బాదేశావేంట్రా ?

టీ ట్వంటీ అంటేనే బ్యాటర్ల గేమ్... అవకాశం దొరికితే పలువురు యువ ఆటగాళ్ళు దుమ్మురేపుతుంటారు. తాజాగా బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ ఓపెన‌ర్ మిచెల్ ఓవెన్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో రెచ్చిపోయాడు.

  • Written By:
  • Publish Date - January 28, 2025 / 03:57 PM IST

టీ ట్వంటీ అంటేనే బ్యాటర్ల గేమ్… అవకాశం దొరికితే పలువురు యువ ఆటగాళ్ళు దుమ్మురేపుతుంటారు. తాజాగా బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ ఓపెన‌ర్ మిచెల్ ఓవెన్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో రెచ్చిపోయాడు. 183 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌లో ఓవెన్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సిడ్నీ బౌల‌ర్ల‌ను ఓవెన్ ఊతికారేశాడు. అత‌డిని అప‌డం ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు బౌల‌ర్ల త‌రం కాలేదు. ఈ క్ర‌మంలో 38 బంతుల్లోనే ఓవెన్ త‌న రెండో బీబీఎల్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవ‌రాల్‌గా ఈ మ్యాచ్‌లో 42 బంతులు ఎదుర్కొన్న ఓవెన్‌.. 6 ఫోర్లు, 11 సిక్స్‌ల‌తో 108 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఓవెన్ తొలుత కేవ‌లం 16 బంతుల్లోనే త‌న హాఫ్ సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. త‌ద్వారా ఓ అరుదైన రికార్డును ఓవెన్ త‌న పేరిట నెలకొల్పాడు. బిగ్‌బాష్ లీగ్ చ‌రిత్ర‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన మూడో ఆట‌గాడిగా టామ్ బాంట‌న్‌తో క‌లిసి మిచెల్ సంయుక్తంగా నిలిచాడు.బీబీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిప్టీ రికార్డు వెస్టిండీస్ దిగ్గ‌జం క్రిస్ గేల్ పేరిట ఉంది. 2016 సీజ‌న్‌లో ఆడిలైడ్ స్ట్రైక‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గేల్ కేవ‌లం 12 బంతుల్లోనే ఆర్ద‌శ‌త‌కంతో మెరిశాడు.

ఆ త‌ర్వాత స్ధానంలో డానియ‌ల్ క్రిస్టియ‌న్‌ 15 బంతులు, ఓవెన్‌ 16) బాంట‌న్‌ 16 ఉన్నారు. కాగా ఈ సీజన్ మొత్తం మిఛెల్ పరుగుల వరద పారించాడు. 10 మ్యాచ్ లలో 191కి పైగా స్ట్రైక్ రేట్ తో 344 పరుగులు చేశాడు. ఈ సీజన్ లోనే రెండు శతకాలు బాదేశాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో మిఛెల్ 25 సిక్సర్లు, 35 ఫోర్లు బాదాడు. ఒక్క ఫైనల్ మ్యాచ్ లోనే అతను 11 సిక్సర్లు కొట్టాడు. అతని దెబ్బకు వార్నర్ సారథ్యంలోని సిడ్నీ టీమ్ చిత్తుగా ఓడిపోయింది. మిఛెల్ విధ్వంసకర బ్యాటింగ్ ను వార్నర్ తో పాటు సిడ్నీ టీమ్ ప్లేయర్స్ అంతా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. అతని విధ్వంసంతో 183 పరుగుల టార్గెట్ ను హోబార్డ్ కేవలం 14.1 ఓవర్లలోనే అందుకుంది. బిగ్ బాష్ లీగ్ టైటిల్ గెలవడం ఆ జట్టుకు ఇదే తొలిసారి.