సన్ రైజర్స్ గెలుపు బాట పట్టేనా ? పంజాబ్ తో మ్యాచ్ కు తుది జట్టు ఇదే

ఐపీఎల్ 18వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో కీలకపోరుకు సిద్ధమైంది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది.

  • Written By:
  • Publish Date - April 12, 2025 / 10:33 AM IST

ఐపీఎల్ 18వ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతగడ్డపై మరో కీలకపోరుకు సిద్ధమైంది. శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో తలపడబోతోంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ కూడా హైదరాబాద్ కు కీలకమే.. రుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడి తీవ్ర నిరాశలో ఉన్న జట్టుకు ఈ మ్యాచ్‌ చావో రేవోగా మారింది. గెలిస్తే.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో మళ్లీ విజయాల బాట పట్టి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు. ఓడితే మాత్రం జట్టులోని ఆటగాళ్లతో పాటు అభిమానులు మరింత నిరాశకు గురవడం ఖాయం. ఆ జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణంగా బ్యాటర్ల వైఫల్యమే… తొలి మ్యాచ్ తప్పిస్తే మిగిలిన మ్యాచ్ లలో సన్ రైజర్స్ బ్యాటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం 150 పరుగులు కూడా చేయలేని పరిస్థితి…దీంతో ప్రధాన బలమైన బ్యాటింగే.. బలహీనంగా మారడం సన్‌రైజర్స్ కొంపముంచుతోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల వైఫల్యం జట్టుకు తీవ్ర నష్టం చేస్తోంది. ఈ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగితేనే.. జట్టు తిరిగి విజయాల బాట పడుతుంది.

అలాగే ఇషాన్ కిషన్ , క్లాసెన్ , నితీశ్ రెడ్డి కూడా ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్ లో సెంచరీ తర్వాత నిరాశ పరుస్తున్నాడు. బౌలర్లు కూడా స్థాయికి తగినట్టు రాణించలేకపోతున్నారు. కమ్మిన్స్ , షమీ, హర్షల్ పటేల్ త్రయం సమిష్టిగా చెలరేగితే తప్ప ఉప్పల్ స్టేడియంలో విజయాన్ని ఆశించడం కష్టమనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది.గత మ్యాచ్‌లో జట్టు ఓటమికి కారణమైన సిమర్జిత్ సింగ్‌పై వేటు పడనుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సిమర్జిత్ సింగ్.. స్లో వికెట్‌పై ఒకే ఓవర్‌లో 20 పరుగులు సమర్పించుకొని జట్టు ఓటమికి కారణమయ్యాడు. ఈ క్రమంలోనే అతన్ని పక్కన పెట్టి అతని స్థానంలో రాహుల్ చాహర్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించ్చు. ఒకవేళ ఆడమ్ జంపాను ఆడించాలనుకుంటే కామిందు మెండీస్‌పై వేటు పడనుంది. అప్పుడు రాహుల్ చాహర్ కూడా బెంచ్‌కే పరిమితమవుతాడు.

ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనున్నారు. ఈ ఇద్దరూ శుభారంభం అందించాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లే పూర్తయ్యే వరకు ఆడినా సరిపోతుంది. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన ఇషాన్ కిషన్ తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అతను ఓ పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. నితీష్ కుమార్ రెడ్డి గతేడాదిలా రాణించలేకపోతున్నాడు. హెన్రీచ్ క్లాసెన్‌, అనికేత్ వర్మ మెరుపులు మెరిపిస్తున్నా.. జట్టు విజయానికి సరిపోవడం లేదు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను ఆడిస్తే అభినవ్ మనోహర్, అథర్వ టైడ్, సచిన్ బేబీలో ఒకరికి అవకాశం దక్కనుంది. జ్వరం నుంచి హర్షల్ పటేల్ కోలుకుంటే.. జయదేవ్ ఉనాద్కత్ స్థానంలో అతను రీఎంట్రీ ఇస్తాడు. పిచ్ కండిషన్స్ బట్టి సన్‌రైజర్స్ తుది జట్టులో మార్పులు చేయనుంది. వికెట్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటే ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగనుంది. స్లోగా ఉంటే మాత్రం ఎక్స్‌ట్రా స్పిన్నర్‌తో బరిలోకి దిగుతారు. బ్యాటింగ్‌ విభాగంలో పెద్దగా మార్పులు చేసే ఛాన్స్ అయితే లేదు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్‌ల్లో మూడు గెలిచి మంచి జోష్‌లో ఉంది. ఇరు జట్ల బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉండటం.. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్‌లో మ్యాచ్ జరుగుతుండటంతో హైస్కోరింగ్ క్లాష్ ఖాయమని అంచనా వేస్తున్నారు.