ఇజ్రాయెల్‌ ధాటికి హమాస్‌ వణుకు.. 400ల శవాలు మోస్తున్న గాజా

రక్తంతో తడిసిన నేల యుద్ధాన్ని కోరుకుంటుంది.. యుద్ధం ఎప్పుడూ రక్తాన్ని మిగిలిస్తుంది. ఇది రక్తంతో రాస్తున్న యుద్ధం.. రక్తాన్ని కోరుకుంటున్న యుద్ధం.

  • Written By:
  • Publish Date - March 20, 2025 / 06:05 PM IST

రక్తంతో తడిసిన నేల యుద్ధాన్ని కోరుకుంటుంది.. యుద్ధం ఎప్పుడూ రక్తాన్ని మిగిలిస్తుంది. ఇది రక్తంతో రాస్తున్న యుద్ధం.. రక్తాన్ని కోరుకుంటున్న యుద్ధం. శవాలుగా మారిన మనుషులు.. శ్మశానాలుగా మిగిలిన ఊళ్లు.. అక్కడ వినిపించేది ఒకటే.. చావు శబ్దం ! గాజాలో పరిస్థితి ఇది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.. బాగుపడడం ఎలా ఉన్నా.. కనీసం బతకొచ్చు అనుకుంటే.. ఆ పరిస్థితి లేకుండా పోతోంది. హమాస్‌ టార్గెట్‌ ఇజ్రాయెల్ మళ్లీ దాడులు మొదలుపెట్టింది. గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ భీకర వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 4వందల మందికిపైగా చనిపోయారు.

వీరిలో ఎక్కుమంది మహిళలు, చిన్నారులే. హమాస్‌తో 17నెలలుగా కొనసాగుతున్న పోరులో… ఈ ఏడాది జనవరి నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉన్నా.. దానికి ఒక్కసారిగా తూట్లు పడినట్లయింది. ఒప్పందంలో మార్పులు చేయడానికి హమాస్‌ తిరస్కరించడంతో… దాడులకు పాల్పడాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఆదేశించారు. ఖాన్‌ యూనిస్, రఫా, ఉత్తర గాజా, గాజాసిటీ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయ్‌. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు… హమాస్‌ అంగీకరించని కారణంగానే దాడులకు ఆదేశించినట్లు నెతన్యాహు తెలిపారు.

బందీలను విడుదల చేయడానికి హమాస్‌ పదేపదే నిరాకరిస్తోందని… యుద్ధ లక్ష్యాలను సాధించడానికి గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఐడీఎఫ్‌ దాడులు చేస్తోందన్నారు. ఇజ్రాయెల్ దాడులను హమాస్‌ తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ ఉల్లంఘించి బందీల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందని వార్నింగ్ ఇచ్చింది. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో ఇకపై ఏం జరగబోతుందన్న భయాలు గాజాలో కనిపిస్తున్నాయ్. రెండేళ్ల కింద మొదలైన యుద్ధంలో.. ఇప్పటివరకు గాజాలో 62వేల మంది వరకు ప్రాణాలు వదిలారు. ఓ దేశానికి, ఓ ఉగ్రవాద సంస్థకు యుద్ధం అయినా.. పోతున్న ప్రాణాలు మాత్రం సామాన్యులవే.