ఏంటా చెత్త బౌలింగ్, టీ20ల్లో సిరాజ్ కెరీర్ క్లోజ్ ?

ఇటీవలే భారత జట్టులో చోటు కోల్పోయిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ రీఎంట్రీ కోసం ఐపీఎల్ లో సత్తా చాటాలని టార్గెట్ పెట్టుకున్నాడు.

  • Written By:
  • Publish Date - March 26, 2025 / 08:15 PM IST

ఇటీవలే భారత జట్టులో చోటు కోల్పోయిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ రీఎంట్రీ కోసం ఐపీఎల్ లో సత్తా చాటాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ ఐపీఎల్ 18వ సీజన్ తొలి మ్యాచ్ లో అతని బౌలింగ్ చూసిన తర్వాత టీ ట్వంటీల్లో సిరాజ్ కెరీర్ ముగిసినట్టేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పంజాబ్ పై అత్యంత పేలవ బౌలింగ్ తో నిరాశపరిచాడు.ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్.. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు. మరోసారి డెత్ ఓవర్లలో తన బలహీనతను బయట పెట్టుకున్నాడు. అతని పేలవ ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 54 పరుగులు సమర్పించుకున్నాడు. తొలి మూడు ఓవర్లలో 31 పరుగులే ఇచ్చిన సిరాజ్.. ఆఖరి ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. శశాంక్ సింగ్ ధాటికి సిరాజ్ వరుసగా 4, 2, 4, 4, వైడ్, 4, 4 ఇచ్చాడు. ఈ ఓవరే గుజరాత్ టైటాన్స్ విజయవకాశాలను దెబ్బతీసింది. సిరాజ్ కట్టడిగా బౌలింగ్‌ చేసుంటే గుజరాత్ టైటాన్స్ విజయం సాధించేది.

ఈ పేలవ ప్రదర్శనతో సిరాజ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సిరాజ్ డెత్ ఓవర్లలో ప్రభావం చూపలేడని, అందుకే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అప్పట్లో కామెంట్ చేశాడు. ఆ మాటలను సిరాజ్ మరోసారి నిజం చేశాడని గుర్తు చేస్తున్నారు. అతని టీ20 ఫార్మాట్ లో అతని బౌలింగ్ బాగా దిగజారిందని కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఆర్‌సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్‌ను వదులుకొని ఆర్‌సీబీ మంచి పనిచేసిందని పోస్ట్‌లు పెడుతున్నారు. ఐపీఎల్‌లో సిరాజ్.. సుదీర్ఘ కాలం ఆర్‌సీబీకే ఆడాడు. గత సీజన్‌లో దారుణంగా విఫలమవడంతో ఆర్‌సీబీ అతన్ని వేలంలోకి వదిలేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్‌తో పాటు ప్రసిధ్ క‌ష్ణ, రబడా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు.

కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాకపోవడంతో అప్పుడు దొరికిన ఖాళీ సమయాన్ని సిరాజ్ అనుకున్న రీతిలో సద్వినియోగం చేసుకోలేదని తెలుస్తోంది. కొత్త బంతితోనైనా, పాత బంతితోనైనా అద్భుతంగా రాణించే బౌలర్లే ఏ జట్టుకైనా కావాలి. ఏ పేస్ బౌలర్ అయినా తన బౌలింగ్ ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటా బ్యాటర్లను ఇబ్బంది పెట్టాల్సిందే.. కానీ సిరాజ్ ఈ దిశగా అనుకున్న స్థాయిలో ఫోకస్ చేయలేకపోతున్నాడన్నది పలువురి అభిప్రాయం. ఇలా అయితే టీమిండియా టీ ట్వంటీ టీమ్ లో సిరాజ్ కెరీర్ ముగిసినట్టేనని అభిప్రాయపడుతున్నారు.