నిమ్మకూరు అనే చిన్న గ్రామం నుంచి వచ్చి.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక చెరిగిపోని ముద్ర వేసుకున్న దిగ్గజం నందమూరి తారకరామారావు. అన్నగారు వచ్చిన అదే ఊరు నుంచి వచ్చారు రాజేంద్రప్రసాద్. అక్కడ్నుంచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. సిరామిక్ ఇంజనీరింగ్ చదివినా, నటనపై ఉన్న మక్కువతో ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి గోల్డ్ మెడల్ సాధించారు. అయితే ఆ గోల్డ్ మెడల్ అవకాశాలను వెంటనే తెచ్చిపెట్టలేదు. చెన్నై వీధుల్లో ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా జీవితాన్ని మొదలుపెట్టి, చిన్న చిన్న వేషాలు వేస్తూ, అవమానాలను దిగమింగుకుని గెలిచిన సెల్ఫ్ మేడ్ స్టార్ ఆయన. ఆకలి, నిరాశ ఎదురైన ప్రతిసారీ తనలోని నటుడిని బతికించుకుంటూ పద్మశ్రీ స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ఎందరో నూతన నటులకు ఆదర్శం.
తెలుగు సినిమా అంటే కమర్షియల్ హంగులే కాదు, కేవలం నటనతో, హాస్యంతో ప్రేక్షకులను మెప్పించవచ్చని నిరూపించిన ఘనత రాజేంద్రప్రసాద్‌దే. దర్శకులు జంధ్యాల, వంశీ, ఈ.వీ.వీ సత్యనారాయణ వంటి దర్శకులతో కలిసి ఆయన సృష్టించిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. లేడీస్ టైలర్, ఆహా నా పెళ్లంట, అప్పుల అప్పారావు, మేడమ్ వంటి సినిమాలు తెలుగునాట నవ్వుల పువ్వులు పూయించాయి. అప్పటివరకూ ఉన్న హీరో ఇమేజ్‌ను పక్కనపెట్టి, ఒక సామాన్య మధ్యతరగతి మనిషి కష్టాలను, భయాలను హాస్యంగా మలిచి కామెడీ కింగ్‌గా సింహాసనాన్ని అధిష్టించారు. కేవలం నవ్వించడమే కాదు, గుండె బరువు పెంచేలా ఏడిపించడం కూడా తనకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తర్వాత కాలంలో నిరూపించుకున్నారు.
80ల్లో ఎర్రమందారం.. ఆ తర్వాత ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి వంటి సినిమాల్లో ఆయన నటన చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు ఉండడు. సమాజానికి సందేశాన్నిస్తూనే, భావోద్వేగాలను పండించడంలో రాజేంద్రప్రసాద్ చూపిన పరిణితి అద్భుతం. ఈ సినిమాలతో ఆయన తనలోని నటకిరీటికి పూర్తి న్యాయం చేశారు. హాస్య నటుడిగానే కాకుండా, ఒక విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనను తాను మలచుకున్న తీరు అశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. రాజేంద్రప్రసాద్ నటనకు సామాన్యులే కాదు, దేశాన్ని ఏలిన దిగ్గజాలు సైతం ముగ్ధులయ్యారు. ముఖ్యంగా మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు కూడా రాజేంద్రప్రసాద్‌కు వీరాభిమాని అన్న విషయం చాలా కొద్దిమందికే తెలుసు.
రాజేంద్రప్రసాద్ సినిమాల్లో ఉండే స్వచ్ఛమైన తెలుగు భాష, ఆరోగ్యకరమైన హాస్యం పీవీ గారికి ఎంతగానో నచ్చేవి. ఎంత బిజీగా ఉన్నా రాజేంద్రప్రసాద్ సినిమా చూసి రిలాక్స్ అయ్యేవారు పీవీ నరసింహారావు. ఒక ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక నటుడిని అంతలా అభిమానించడం అనేది రాజేంద్రప్రసాద్ సాధించిన అరుదైన గౌరవం. ఇక నేటి తరంతో ఆయన ప్రయాణం గురించి ఎంత చెప్పినా తక్కువే. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని లాంటి యువ హీరోలతో పోటీపడి మరీ నటిస్తున్నారు. జులాయి, శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, కల్కి 2898 AD వంటి చిత్రాల్లో మోడరన్ తండ్రిగా, తాతగా, సహాయ నటుడిగా ఆయన పోషిస్తున్న పాత్రలు నేటి యూత్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి. జనరేషన్ గ్యాప్ లేకుండా, సెట్‌లో అందరితో కలిసిపోతూ, ఇప్పటికీ అదే ఉత్సాహంతో నటిస్తున్న రాజేంద్రప్రసాద్ గారు నిజంగా తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం.