ఐపీఎల్ 2026 సీజన్ సమీపిస్తున్న వేళ రెండు ప్రధాన ఫ్రాంచైజీలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తమ సొంత మైదానాల విషయంలో తీవ్ర సందిగ్ధంలో పడ్డాయి. ఈ రెండు జట్లు తమ హోమ్ వేదికలను ఖరారు చేసుకోవడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి జనవరి 27 వరకు గడువు విధించింది.ఆర్సీబీ జట్టుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ప్రాణం వంటిది. కానీ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనలు ఇప్పుడు ఫ్రాంచైజీకి తలనొప్పిగా మారాయి. స్టేడియం బయట ఉన్న రోడ్ల నిర్వహణ, అగ్నిమాపక దళం మోహరింపు వంటి ప్రభుత్వ బాధ్యతలను ఫ్రాంచైజీయే చూసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెట్టింది. స్టేడియంలో డీజే నిర్వహణకు అనుమతి నిరాకరించడం ఆర్సీబీ యాజమాన్యానికి నచ్చడం లేదు. ఈ సమస్యలపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ తో కలిసి ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. ఒకవేళ ఇవి సఫలం కాకపోతే ఆర్సీబీ తన వేదికను మార్చుకునే అవకాశం ఉంది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం హోమ్ గ్రౌండ్. అయితే ఇక్కడ క్రికెట్ అసోసియేషన్ పాలన సమస్యగా మారింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌లో చాలా కాలంగా ఎన్నికలు జరగలేదు. ఈ పరిపాలనాపరమైన గందరగోళం వల్ల జైపూర్‌లో మ్యాచ్‌లు నిర్వహించడంపై బీసీసీఐ అసహనంతో ఉంది. జైపూర్‌లో పరిస్థితులు మెరుగుపడకపోతే, రాజస్థాన్ రాయల్స్ తమ హోమ్ మ్యాచ్‌ల కోసం జోధ్‌పూర్ లేదా ఇతర నగరాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి రావచ్చు.షెడ్యూల్ ఖరారు చేయాలంటే వేదికల విషయంలో స్పష్టత ఉండాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే జనవరి 27 లోపు ఈ రెండు జట్లు తమ నిర్ణయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు తెలియజేయాలని ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా వేదికలు ఖరారు కాకపోతే, బీసీసీఐయే ప్రత్యామ్నాయ నగరాలను కేటాయించే అవకాశం ఉంది.