మహారాష్ట్రలో కుప్పకూలిన విమానం, మహా డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ దుర్మరణం…!

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండ్​ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది.

  • Written By:
  • Publish Date - January 28, 2026 / 01:45 PM IST

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో ఉపముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ మరణించారు. విమానం ల్యాండ్​ అవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అజిత్​ పవార్​తో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం…బారామతిలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్‌ పవార్‌తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి నుంచి 8.45 గంటలకు బారామతి బయలుదేరారు. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం ముక్కలైంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. అజిత్‌ పవార్‌, ముంబై పీఎస్‌వో విదీప్‌ జాదవ్, కెప్టెన్‌ సుమీత్ కపూర్‌, కెప్టెన్ శాంభవీ పాఠక్, ఫ్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి ప్రాణాలు కోల్పోయారు.

పుణెలోని బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ పాల్గొనాల్సి ఉంది. అందుకోసం ఉదయం ముంబయి నుంచి బారామతికి వీఎస్​ఆర్​ సంస్థకు చెందిన లీర్​జెట్​-45 విమానంలో బయలుదేరారు. బారామతిలో ల్యాండ్​ అవుతుండగా 8:45 గంటల సమయంలో ఆయన విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. విమానం పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సంబంధిత వర్గాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. అజిత్ పవార్, సుప్రియా సూలే…బారామతికి బయల్దేరారు.సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. విమానంలో అజిత్​ పవార్​తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఇద్దరు క్రూ సభ్యులు ఉన్నారు. అజిత్ పవార్‌ మృతి పట్ల ప్రధాని మోడీతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

అజిత్‌ పవార్‌ 1959 జులై 22న జన్మించారు. తండ్రి అనంత్‌రావ్‌ పవార్‌.. సీనియర్‌ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్‌ పవార్‌ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌పవార్‌.. 1982లో తొలిసారి కార్పొరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్‌ పవార్‌ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.