మోడీ వైజాగ్ టూర్ ఖర్చు ఎంతంటే…?

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా ఇటీవల విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - January 13, 2025 / 05:14 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా ఇటీవల విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగానే ఖర్చు చేసింది. ఇటీవల విశాఖలో నిర్వహించిన కార్యక్రమానికి రూ.12.50 కోట్ల మేర ఖర్చు అయినట్లు రెవెన్యూ వర్గాలు లెక్కలను బయటపెట్టాయి. తొలి విడతగా ప్రభుత్వం రూ.5 కోట్లు వరకు విడుదల చేసినట్టు తెలిపారు. ఇంకా రూ.7.50 కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉంది.

సరఫరాదారులకు ప్రస్తుతం కొంత మేర బిల్లులు చెల్లించినా, ఇంకా బకాయిలు ఉన్నట్టు వివరించారు. బహిరంగ సభ, రోడ్‌షోకు సంబంధించి ప్రజలను తరలించేందుకు 2150 ఆర్టీసీ బస్సులు, 8 వేల ఆటోలు, 825 ప్రైవేటు బస్సులు, 180 మ్యాక్సీక్యాబ్‌లు వినియోగించామని పేర్కొన్నారు. 2.60 లక్షల ఆహార పొట్లాలు తయారు చేయించి మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పంపిణీ చేసామని తెలిపారు.

వీటితో పాటు తాగునీటి సరఫరా, నగరానికి వచ్చిన ప్రధానమంత్రి, సీఎం, గవర్నర్, డిప్యూటీ సీఎంకు నాలుగు కాన్వాయ్‌లు వినియోగించామని… మంత్రులు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు స్టార్‌ హోటల్స్‌ లో బస, వారికి భద్రత, రవాణా సౌకర్యాలు కల్పించినట్టు వివరించారు. వీటితో పాటు ఎల్‌ఈడీ భారీ స్క్రీన్‌లు, వేదిక వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్‌ రూమ్స్, వేదిక నిర్మాణం, బారికేడ్లు, టెంట్లు.. తదితరాలకు అయిన ఖర్చు అదనమని పేర్కొన్నారు.