అడ్డం తిరిగిన విజయమ్మ

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి...తల్లి విజయలక్ష్మి షాకిచ్చారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి, కొడలు భారతిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కంపెనీ వాటాలను చట్టబద్దంగా బహుమతిగా ఇస్తూ...

  • Written By:
  • Publish Date - February 12, 2025 / 03:45 PM IST

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి…తల్లి విజయలక్ష్మి షాకిచ్చారు. కొడుకు జగన్మోహన్ రెడ్డి, కొడలు భారతిరెడ్డి చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కంపెనీ వాటాలను చట్టబద్దంగా బహుమతిగా ఇస్తూ…చేస్తున్న ఒప్పందంలో జోక్యం చేసుకునే అధికారం ఎన్సీఎల్టీ లేదని విజయలక్ష్మి, వైఎస్ షర్మిలా రెడ్డి స్పష్టం చేశారు. కుమారుడు, కోడలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. కొడుకు జగన్, కూతురు షర్మిలా రెడ్డి మధ్య వివాదంలో…తాను కోర్టు మెట్లెక్కడం కలచివేస్తోందని విజయలక్ష్మి వాపోయారు. జగన్‌, భారతి చెబుతున్న అంశాలన్నీ నిరాధారమని…ఆ ఆరోపణలు న్యాయసమీక్ష ముందు నిలబడవని అన్నారు.

సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద, భార్య భారతి, క్లాసిక్‌ రియాలిటీ పేరుతో షేర్ల విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు భారతి పేరుతో ఉన్న షేర్లను..తల్లి విజయమ్మ, సోదరి షర్మిలారెడ్డి అక్రమంగా బదిలీ చేసుకున్నారంటూ…మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కేసు వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌లో తమకు 51.01 శాతం వాటా ఉన్నట్లు పిటిషన్​లో వెల్లడించారు. భవిష్యత్​లో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా…2019 ఆగస్టు 31న అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సరస్వతీ పవర్​లో జగన్​కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు, భారతి డైరెక్టర్​గా ఉన్న క్లాసిక్ రియాల్టీకి చెందిన వాటాలు కలిపి…మొత్తం 1.21 కోట్లకు పైగా షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు.

షర్మిల తరఫున విజయమ్మ…తన పేరు మీద షేర్లు బదిలీ చేయించుకున్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈడీ, సీబీఈ కేసులు, కోర్టు వివాదాలు తేలిన తర్వాత మిగతావి బదిలీ చేయాలకున్నట్లు జగన్ వివరించారు. ఆ తర్వాత ఇరువురి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో ఆస్తి తగాదాలు తలెత్తాయి. షేర్లకు సంబంధించి ఎంవోయూ, గిఫ్ట్ డీడ్ అమలు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు జగన్ పిటిషన్‌లో ప్రస్తావించారు. తనకు తెలియకుండానే షేర్ల బదిలీ ఫారాలు, డాక్యుమెంట్లు, సంతకాలు కూడా లేకుండానే బదిలీ జరగిందన్నారు. ఇది కంపెనీ చట్టానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన షేర్ల బదిలీని రద్దు చేసి జగన్, భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట 51.01 శాతం యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌సీఎల్‌టీని కోరారు. ఆ షేర్లను తన తల్లికి గిఫ్టుగా ఇచ్చానని.. వాటిని తాను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చని చెప్పారు. తాను గిఫ్ట్‌గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమన్న జగన్…ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు.

జగన్ పిటిషన్ కు విజయలక్ష్మి, షర్మిలరెడ్డి…ఎన్సీఎల్టీలో వేర్వేరుగా కౌంటర్లు దాఖలు చేశారు. రాజకీయ ఉద్దేశాలు, కారణాలతోనే జగన్‌ ఎన్‌సీఎల్‌టీలో తప్పుడు కేసు వేశారని తెలిపారు. జగన్‌ పిటిషన్‌కు ఇద్దరూ 38 పాయింట్లతో ఘాటుగా సమాధానాలిచ్చారు. కుటుంబ వివాదాన్ని కంపెనీ వివాదంగా మార్చారని వాపోయారు. సొంత బిడ్డలపైనే ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ వేయాల్సి రావడం…గుండెను పిండేసినట్లయిందని విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఆగస్టు 31న కుటుంబం మధ్య జరిగిన ఎంవోయూ…మేరకే సరస్వతి పవర్‌ షేర్ల బదలాయింపు జరిగిందని ఇద్దరు కౌంటర్ దాఖలు చేశారు. ఎన్‌సీఎల్‌టీని తప్పుదారి పట్టించేలా జగన్‌ రాజకీయ ప్రేరిత వ్యాజ్యం వేశారని తల్లీ కుమార్తెలు తెలిపారు. వాటాల బదలాయింపుపై జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలేనని స్పష్టం చేశారు. చట్టబద్ధంగా జరిగిన ఎంఓయూపై వాస్తవాలు వివరిస్తూ…తాము పొందుపరచిన సాక్ష్యాధారాలను పరిశీలించాలని ఎన్స్ఎల్టీని కోరారు.

జగన్మోహన్ రెడ్డి తరపున వైసీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించగా..విజయలక్ష్మి, షర్మిల తదితరుల తరఫున న్యాయవాది విశ్వరాజ్‌ వాదనలు వినిపించారు. ప్రతివాదులకు గత ఏడాది సెప్టెంబరులోనే నోటీసులు జారీచేసినప్పటికీ.. ఇద్దరు మాత్రమే దాఖలు చేశారని ఎన్సీఎల్టీ తెలిపింది. అందరూ కౌంటర్లు సమర్పిస్తే…రిజాయిండర్‌ దాఖలు చేస్తామని వెల్లడించింది. ఆన్‌లైన్‌లో తాము కౌంటర్లు దాఖలు చేశామని…రెండ్రోజుల్లో భౌతికంగా ధర్మాసనానికి సమర్పిస్తామని విజయలక్ష్మి, షర్మిల తరపున విశ్వరాజ్ ఎన్సీఎల్టీకి తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ట్రైబ్యునల్‌.. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.