సెంచరీతో దుమ్మురేపిన బ్రంట్… ఆర్సీబీని చిత్తు చేసిన ముంబై

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు కనబర్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారిగా ఢీలా పడింది.

  • Written By:
  • Publish Date - January 27, 2026 / 06:46 PM IST

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో జోరు కనబర్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారిగా ఢీలా పడింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కొట్టిన దెబ్బకు విలవిలలాడుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడి డేంజర్ జోన్‌లో నిలిచింది.మరోవైపు ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ దుమ్మురేపింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ 57 మ్యాచ్‌ల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 100 పరుగులు చేసింది. ఆమె విధ్వంసకర శతకంతో 15 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ముంబై ఓడించింది. ఈ గెలుపుతో లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో ఎదురైన మ్యాచ్‌కు ముంబై ప్రతీకారం తీర్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నాట్ సీవర్ నాటు కొట్టుడుకు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. హీలీ మాథ్యూస్ 39 బంతుల్లో 9 ఫోర్లతో 56 రన్స్ తో  రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడింది. ఆర్‌సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు వికెట్లు తీయగా.. నదినే డీక్లెర్క్, శ్రేయాంక పాటిల్ చెరో వికెట్ తీసారు.అనంతరం ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులు చేసింది. రిచా ఘోష్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 రన్స్ తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది.

గ్రేస్ హ్యారీస్, స్మృతి మంధాన, జార్జియో వోల్, గౌతమి నాయక్ తీవ్రంగా నిరాశపర్చారు. రిచా ఘోష్‌కు అండగా ఒక్క బ్యాటర్ రాణించినా ఫలితం మరోలా ఉండేది. ముంబై బౌలర్లలో హీలీ మాథ్యూస్ మూడు వికెట్లతో  ఆర్‌సీబీ పతనాన్ని శాసించింది. షబ్నీమ్ ఇస్మాయిల్, అమెలియా కేర్ రెండేసి వికెట్లు తీయగా.. అమన్‌జోత్ కౌర్ ఒక వికెట్ తీసింది.
వరుసగా 5 విజయాలతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్‌సీబీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి నేరుగా ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికిప్పుడు ఆర్‌సీబీకి వచ్చిన ప్రమాదం ఏం లేదు. యూపీ వారియర్స్‌తో గురువారం జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఏ జట్టుతో సంబంధం లేకుండా ఆర్‌సీబీ ఫైనల్ చేరుతుంది.