ఇగో ఉంటే జట్టులో ఉండవు సంజూపై క్రిస్ శ్రీకాంత్ ఫైర్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఇంగ్లాండ్ తో సిరీస్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అవకాశాలను వృథా చేసుకుంటూ ఉంటాడన్న విమర్శలు ఎదుర్కొనే సంజూ ఇటీవల వాటి నుంచి బయటపడినట్టే కనిపించాడు.

  • Written By:
  • Publish Date - February 5, 2025 / 06:45 PM IST

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఇంగ్లాండ్ తో సిరీస్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. అవకాశాలను వృథా చేసుకుంటూ ఉంటాడన్న విమర్శలు ఎదుర్కొనే సంజూ ఇటీవల వాటి నుంచి బయటపడినట్టే కనిపించాడు. సౌతాఫ్రికా టూర్ , దాని కంటే ముందు బంగ్లాదేశ్ తో సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. కానీ ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో మళ్ళీ పాత కథే రిపీటయింది. పైగా ఈ సిరీస్ అన్ని మ్యాచ్ లలోనూ సంజూ ఒకే తరహా షాట్ కు ఔటయ్యాడు. పదేపదే షార్ట్‌ బాల్స్‌ ఎదుర్కోవడంలో విఫలమైన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. ఫీల్డర్లకు సులువైన క్యాచ్‌లు ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఘాటు విమర్శలు చేశాడు. ఒకవేళ ఇగో చూపించాలనుకుంటే మాత్రం జట్టులో చోటు కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించాడు. ఇకముందైనా షాట్ల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని సూచించాడు.

సంజూ శాంసన్‌ తనకు వచ్చిన అవకాశాలను పూర్తిగా వృథా చేసుకున్నాడనీ, ఐదోసారి కూడా అదే రీతిలో అవుటయ్యాడని గుర్తు చేశాడు. తనకు తెలిసి.. అతడు తన ఇగోను సంతృప్తి పరచుకునేందుకు ఇలా చేశాడని అనుకుంటున్నానంటూ శ్రీకాంత్ ఫైర్ అయ్యాడు. తాను ఈ షాట్ కచ్చితంగా ఆడగలనంటూ నిరూపించుకునే ప్రయత్నం చేశాడంటూ విమర్శించాడు. అసలు అతడు ఫామ్‌లేమితో సతమతమయ్యాడా.. లేదంటే.. ఇగో ట్రిప్‌నకు ఏమైనా వెళ్లాడా? అన్నది ఏమీ అర్థం కావడం లేదంటూ శ్రీకాంత్ ఘాటుగా విమర్శించాడు. సంజూను చాంపియన్స్‌ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదని అంతా మాట్లాడుకుంటున్నారనీ, ఇలాగే ఆడితే మాత్రం సెలక్టర్లు సంజూను పక్కన పెట్టేస్తారన్నాడు. అతని స్థానంలో యశస్వి జైస్వాల్‌ తిరిగి వస్తాడనీ హెచ్చరించాడు.

ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా గాయపడ్డ సంజూ శాంసన్‌.. ఆరు వారాలు పూర్తిగా ఆటకు దూరం కానున్నాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్స్‌కు కేరళ జట్టుకు అతడు అందుబాటులో ఉండటం లేదు. కాగా ఇంగ్లండ్‌తో ఆదివారం ముంబైలో జరిగిన చివరిదైన ఐదో టి20లో బ్యాటింగ్‌ చేస్తుండగా సీమర్‌ జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో అతని కుడి చూపుడు వేలికి గాయమైంది. దాని నుంచి కోలుకునేందుకు త్వరలోనే జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్ళనున్నాడు. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లలో కొన్నింటికి సంజూ అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది.