గెలిచే మ్యాచ్ లో ఓడిన ఢిల్లీ… ఇక ప్లే ఆఫ్ చేరడం కష్టమే…!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.

  • Written By:
  • Publish Date - January 29, 2026 / 11:30 AM IST

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 174 పరుగులు చేసింది. బెత్ మూనీ 46 బంతుల్లో 7 ఫోర్లతో 58, అనుష్క శర్మ 25 బంతుల్లో 8 ఫోర్లతో 39 టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో తెలుగు తేజం శ్రీచరణి నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. చినెల్లే హెన్రీ రెండు వికెట్లు పడగొట్టింది. 175 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో నికీ ప్రసాద్ 24 బంతుల్లో 9 ఫోర్లతో 47, స్నేహ్ రాణా 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29 జట్టును ఆదుకున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఢిల్లీ శిభిరంలో ఆశలు రేకెత్తించారు.

ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 9 పరుగులు అవసరమయ్యాయి. ఢిల్లీ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ ఆఖరి ఓవర్‌లో హైడ్రామా చోటు చేసుకుంది. చివరి ఓవర్ తొలి బంతికే రాణా రనౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ నిర్ణయం కోసం అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరడంతో ఆటకు బ్రేక్ వచ్చింది. దాంతో ఢిల్లీ బ్యాటర్ల మూమెంటమ్ దెబ్బతింది.తొలి మూడు బంతులను కట్టుదిట్టంగా వేసిన సోఫీ డివైన్ 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఒత్తిడి పెంచింది. నాలుగో బంతికి రాణాను ఔట్ అవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ చేజారింది. ఐదో బంతికి సింగిల్ రాగా.. ఆఖరి బంతికి 4 పరుగులు అవసరమయ్యాయి. కానీ నికీ ప్రసాద్ ఔటవ్వడంతో గుజరాత్ విజయం లాంఛనమైంది.

బౌలింగ్‌లో తెలుగు తేజం శ్రీచరణి 4 వికెట్లతో రాణించి జట్టు విజయం కోసం పడ్డ కష్టం వృథా అయ్యింది. ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లు 3 విజయాలతో ఢిల్లీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. యూపీ వారియర్స్‌తో ఆ జట్టు ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా.. ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ చేరగా.. తదుపరి రెండు స్థానాల కోసం ముంబై, ఢిల్లీ, గుజరాత్ మధ్య పోటీ నెలకొంది. గుజరాత్‌కు మెరుగైన అవకాశాలు ఉండగా.. ఢిల్లీ, ముంబై తమ ఆఖరి మ్యాచ్‌ల్లో మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.