ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అయితే, క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లీగ్‌లలో ఒకటైన ఐపీఎల్ కోసం అభిమానుల ఉత్సాహం అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. 44 ఏళ్ల వయసులోనూ ధోని మైదానంలో చెమటోడుస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా విడుదల చేసిన ఈ వీడియో ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్యాడ్లు కట్టుకుని, నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూ కనిపిస్తున్నారు. రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ధోనీ సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఈ వీడియో ద్వారా స్పష్టమవుతోంది.
వీడియోలో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ, బౌలర్లపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, తలా తన ప్రిపరేషన్ ను ముందే ప్రారంభించాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.జార్ఖండ్ క్రికెట్ బోర్డు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జోడించింది. చూడండి ఎవరు తిరిగి వచ్చారో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అన్ని జట్లు ఐపీఎల్‌కు ముందు జరగనున్న టీ20 ప్రపంచ కప్ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నాయి. ప్రపంచ కప్ ముగిసిన వెంటనే, ఆటగాళ్లందరూ ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చేస్తారు.
ఈ క్రమంలో ధోని ప్రాక్టీస్ వీడియో అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.ముఖ్యంగా ధోని వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ సీజన్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత ఐపీఎల్ సీజన్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మ్యాచ్‌లను ఫినిష్ చేయడంలోనూ, భారీ సిక్సర్లు కొట్టడంలోనూ పేరుగాంచిన ధోని, గత సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లలో కేవలం 196 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, తాజా వీడియోలో ధోనీ ప్రాక్టీస్ చూస్తుంటే, రాబోయే సీజన్‌లో కచ్చితంగా విధ్వంసం సృష్టిస్తారని, 44 ఏళ్ల వయసులోనూ తన బ్యాట్ పవర్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.