సర్ఫరాజ్ ఖాన్‌కి మరో అవకాశం ఇవ్వండి.. అగార్కర్‌కు అజారుద్దీన్ సూచన

దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - January 27, 2026 / 08:15 PM IST

దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత జట్టు తరఫున సర్ఫరాజ్ చివరిసారిగా 2024లో ఆడాడు. ఆ తర్వాత తన ఫిట్‌నెస్‌కు ప్రధాన సమస్యగా మారిన బరువు తగ్గి తనను తాను నిరూపించుకున్నాడు.. తాజాగా దేశవాళీ క్రికెట్‌లో వరుసగా భారీ ఇన్నింగ్స్‌లతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు.విజయ్ హజారే ట్రోఫీలో 157, 55, 62 పరుగులు చేసిన సర్ఫరాజ్.. రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌పై ఏకంగా 227 పరుగులు బాది తన ఫామ్‌ను గట్టిగా చాటుకున్నాడు. ఈ ప్రదర్శనలతో మరోసారి టీమిండియా తలుపులు గట్టిగా తడుతున్నాడు.

ఈ క్రమంలో సర్ఫరాజ్‌కు భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ సపోర్ట్‌గా నిలిచాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అజార్, సర్ఫరాజ్ ఆటతీరుపై ప్రశంసలు కురిపిస్తూ, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కర్ మరో అవకాశం ఇవ్వాలని కోరాడు. సర్ఫరాజ్‌తో గడిపిన సమయాన్ని గుర్తు చేసుకున్న అజారుద్దీన్, రివర్స్ స్వింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తాను సూచనలు ఇచ్చినట్టు తెలిపాడు. ఒకసారి కలవడానికి సర్ఫరాజ్ దాదాపు 45 నిమిషాలు ఎదురుచూశాడన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు.సర్ఫరాజ్ ఆట శైలిపై మాట్లాడిన అజార్ అతను చాలా అగ్రెసివ్ బ్యాటర్ అన్నాడు. మ్యాచ్ పరిస్థితిని ఒక్కసారిగా మార్చగలడనీ,. బౌలర్ ఆధిపత్యాన్ని అతను అస్సలు ఇష్టపడడనీ చెప్పుకొచ్చాడు. మంచి బౌలర్‌ను మనం ఆధిపత్యం చెలాయించనిస్తే ఇబ్బంది పడాల్సిందేనన్నాడు. స్వింగ్, బౌన్స్ ఉన్న పిచ్‌పై కూడా వేగంగా పరుగులు చేయడం అతని క్వాలిటీని చూపిస్తోందని ప్రశంసించాడు.

సర్ఫరాజ్ ఖాన్ 2024లో ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసి వెంటనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ధర్మశాలలో మరో అర్ధశతకం నమోదు చేసిన అతను, బెంగళూరులో న్యూజిలాండ్‌పై కెరీర్ బెస్ట్ 150 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి జట్టులో ఉన్నప్పటికీ అతనికి తుది జట్టులో అవకాశం రాలేదు. ఆ తర్వాత ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక కాకపోవడంతో మళ్లీ దేశవాళీ క్రికెట్‌కే పరిమితమయ్యాడు.అతనికి మరో అవకాశం తప్పకుండా రావాలనీ, అన్ని చోట్ల పరుగులు చేస్తున్నాడునీ గుర్తు చేసాడు. ఇలాంటి అటాకింగ్ బ్యాటర్లు భారత జట్టుకు అవసరమనీ, పరుగులు చేసినా అవకాశం రాకపోతే నిరాశే మిగులుతుందన్నాడు.