వుమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయ ఢంకా మోగించిన ఆర్‌సీబీ.. ఆరో మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. శనివారం వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. బ్యాటింగ్ వైఫల్యం ఆర్‌సీబీ కొంపముంచగా.. మరిజన్నే కాప్ ఆల్‌రౌండ్ షో ఢిల్లీకి విజయాన్నందించింది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ స్మృతి మంధాన 34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 38 టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో నందని శర్మ మూడు వికెట్లు, హెన్రీ, మరిజన్నే కాప్, మిన్ను మని రెండేసి వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించారు. తెలుగు తేజం శ్రీచరణి ఒక వికెట్ పడగొట్టింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 15.4 ఓవర్లలో 3 వికెట్లకు 111 పరుగులు చేసి గెలుపొందింది. లారా వోల్వార్డ్ట్ 38 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 42, మరిజన్నే కాప్19 రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది.ఈ ఘోర పరాజయంతో ఆర్‌సీబీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. వరుసగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఆర్‌సీబీ.. నేరుగా ఫైనల్ చేరేందుకు మరో విజయం దూరంలో నిలిచింది. డబ్ల్యూపీఎల్ టోర్నీ రూల్స్ ప్రకారం టాప్-3లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్ చేరితే.. టేబుల్ టాపర్ నేరుగా తుది పోరుకు అర్హత సాధిస్తుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి. అందులో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతోంది.
ప్రస్తుతం ఆర్‌సీబీ టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ఆర్‌సీబీ ఫైనల్ బెర్త్ ఖరారు కానుంది. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడినా మెరుగైన రన్‌రేట్‌తో నిలవాలి.అలా కాకుండా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ తమ తదుపరి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి అగ్రస్థానంలో నిలిస్తే ఆర్‌సీబీ ఫైనల్ అవకాశాలు గల్లంతవుతాయి. అయితే ప్రస్తుతం ఆర్‌సీబీ రన్ రేట్ మెరుగ్గా ఉండగా.. ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ రన్‌రేట్ నెగటీవ్‌గా ఉన్నాయి.