ఛాంపియన్లకు గుర్తింపు… పద్మ అవార్డుల్లో క్రీడాకారుల జోరు…!

76వ గణతంత్ర దినోత్సవ వేళ భారత క్రీడారంగం గర్వించేలా కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది.

  • Written By:
  • Publish Date - January 26, 2026 / 02:15 PM IST

76వ గణతంత్ర దినోత్సవ వేళ భారత క్రీడారంగం గర్వించేలా కేంద్ర సర్కారు పద్మ పురస్కారాలను ప్రకటించింది. హాకీ, క్రికెట్, ఫుట్‌బాల్, పారా -ఆర్చరీ విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన దిగ్గజ క్రీడాకారులను ఈ గౌరవం వరించింది. భారత అత్యున్నత పౌర పురస్కారాల జాబితాలో ఈ సారి క్రీడాకారులకు పెద్దపీట వేశారు. దశాబ్ధ కాలంగా భారత హాకీకి వెన్నెముకగా నిలిచిన వెటరన్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్‌ను ప్రభుత్వం పద్మభూషణ్‌తో గౌరవించింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు కాంస్యం గెలవడంలో శ్రీజేష్ కీలక పాత్ర పోషించారు. తన కెరీర్‌లో ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ వంటి అనేక ఘనతలను సాధించిన ఆయన, పారిస్ ఒలింపిక్స్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించారు.

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్‌ను కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో తన టెస్టు కెరీర్‌ను ముగించిన అశ్విన్.. 106 మ్యాచ్‌ల్లో 537 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించారు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ 6 సెంచరీలు సాధించి అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

పారిస్ 2024 పారాలింపిక్స్‌లో పారా-ఆర్చరీ విభాగంలో భారత్‌కు మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించిన హర్విందర్ సింగ్‌కు కూడా పద్మశ్రీ లభించింది. టోక్యో గేమ్స్‌లో కాంస్యం సాధించి ఇప్పటికే వార్తల్లో నిలిచిన ఆయన.. వరుసగా రెండు పారాలింపిక్స్‌లో పతకాలు సాధించి భారత క్రీడారంగ కీర్తిని దశదిశలా చాటారు.ఫుట్‌బాల్ రంగం నుంచి భారత మాజీ కెప్టెన్ ఐ.ఎం. విజయన్‌ను పద్మశ్రీ పురస్కారం వరించింది. 90వ దశకంలో భారత జట్టు SAFF ఛాంపియన్‌షిప్‌లను గెలవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు భారత క్రీడారంగానికి దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న కోచ్ సత్యపాల్ సింగ్‌ను కూడా పద్మశ్రీతో గౌరవించారు.