ప్లేబ్యాక్ సింగింగ్‌కు గుడ్ బై చెప్పిన అర్జిత్ సింగ్.. ఒక శకం ముగిసింది..!

భారతీయ సంగీత ప్రపంచంలో తన గొంతుతో మ్యాజిక్ చేసిన అర్జిత్ సింగ్.. తాజాగా ప్లేబ్యాక్ సింగింగ్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించి కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

  • Written By:
  • Updated On - January 28, 2026 / 08:05 PM IST

భారతీయ సంగీత ప్రపంచంలో తన గొంతుతో మ్యాజిక్ చేసిన అర్జిత్ సింగ్.. తాజాగా ప్లేబ్యాక్ సింగింగ్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించి కోట్లాది మంది అభిమానులను ఆశ్చర్యపరిచాడు. జనవరి 27, 2026న తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ఇకపై కొత్తగా సినిమా పాటలు పాడను, ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగిందని పేర్కొన్నాడు. అయితే సంగీతాన్ని పూర్తిగా ఆపేయడం లేదని, ఇకపై ఇండిపెండెంట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్ మీద దృష్టి సారిస్తానని ఆయన స్పష్టం చేశాడు. పశ్చిమ బెంగాల్‌లోని ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన అర్జిత్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 2005లో ఫేమ్ గురుకుల్ అనే రియాలిటీ షోలో పాల్గొని ఓడిపోయిన ఆయన.. ఆ పరాజయాన్ని చూసి కుంగిపోలేదు. ముంబైలో మ్యూజిక్ ప్రోగ్రామర్‌గా పని చేస్తూ ఎన్నో ఏళ్లు కష్టపడ్డాడు.

2011లో మర్డర్ 2 ద్వారా ఎంట్రీ ఇచ్చినా.. 2013లో వచ్చిన ‘ఆషికీ 2’ చిత్రంలోని తుమ్ హి హో పాట ఆయన్ని రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. అప్పటి నుండి గడిచిన దశాబ్ద కాలంలో ఆయన లేని బాలీవుడ్ సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అర్జిత్ సింగ్ ఇప్పటివరకు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం వంటి పలు భాషల్లో కలిపి సుమారు 1000కి పైగా పాటలు పాడాడు. కేవలం హిందీలోనే కాకుండా తెలుగులో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా మనం సినిమాలోని కనులను తాకే, దోచేయ్, స్వామి రారా వంటి సినిమాల్లో ఆయన పాడిన పాటలు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
ఆయన కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్లకు కొదవే లేదు.

చన్న మేరేయా, కేసరియా, అగర్ తుమ్ సాత్ హో, హవాయే, ఏ దిల్ హై ముష్కిల్ వంటి పాటలు విరహ వేదనను, ప్రేమను పలికించడంలో ఆయన్ని కింగ్ ఆఫ్ సోల్ గా నిలబెట్టాయి. వినేవారి కళ్ళలో నీళ్లు తెప్పించాలన్నా, ప్రేమలో ముంచెత్తాలన్నా అర్జిత్ గొంతుకు ఉన్న పవర్ మరెవరికీ లేదని ఫ్యాన్స్ నమ్ముతారు. స్పాటిఫై లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఆర్టిస్టులలో ఒకరిగా ఆయన చరిత్ర సృష్టించారు. అర్జిత్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగింగ్‌లో ఒక శకానికి ముగింపు పలికినట్లయింది. ఎన్నో కోట్లు, విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ.. ఆయన ఎప్పుడూ తన సొంత ఊర్లో స్కూటర్ మీద తిరుగుతూ చాలా నిరాడంబరంగా జీవించడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఆయన కమర్షియల్ సినిమాలకు దూరమైనా.. ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా సరికొత్త మెలోడీలను అందిస్తారని ఆశిద్దాం. ఆయన సినిమా పాటలు ఆగిపోవచ్చు కానీ అర్జిత్ అనే ఎమోషన్ మాత్రం శ్రోతల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది.