భారతీయ చలనచిత్ర రంగానికి వన్నె తెచ్చిన కళాకారులను భారత ప్రభుత్వం ఎప్పుడూ సముచిత రీతిలో గౌరవిస్తూనే ఉంటుంది. దేశంలోనే రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ సినిమా రంగానికి చెందిన పలువురు దిగ్గజాలను వరించింది. తాజాగా 2026 సంవత్సరానికి గాను ప్రముఖ బాలీవుడ్ దివంగత నటుడు ధర్మేంద్రకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డును మరణానంతరం ప్రకటించడం గమనార్హం. ఆయనతో పాటు ఇప్పటివరకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న సినీ ప్రముఖుల జాబితా చాలా ప్రత్యేకమైనది. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచిన వాళ్లలో చిరంజీవి, అక్కినేని నాగేశ్వరరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో రికార్డులు సృష్టించిన మెగాస్టార్ చిరంజీవిని 2024లో పద్మ విభూషణ్ వరించింది. అంతకుముందు 2011లోనే ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు చరిత్ర సృష్టించారు.
ఇక 2024లో అలనాటి ప్రముఖ నటి, శాస్త్రీయ నృత్య కళాకారిణి వైజయంతీమాల కూడా ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం విశేషం. సంగీత ప్రపంచంలో తమ గాత్రంతో కోట్లాది మందిని మైమరిపించిన గాయకులకు కూడా ఈ పురస్కారం దక్కింది. భారతీయ సినిమా పాటకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు 2021లో మరణానంతరం పద్మ విభూషణ్ లభించింది. అలాగే 2017లో ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాస్‌ను ఈ పురస్కారం వరించగా.. 1999లోనే గాన కోకిల లతా మంగేష్కర్ ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోవడం భారతీయ సంగీతానికి దక్కిన గొప్ప గుర్తింపు. హిందీ చిత్రసీమలో తమదైన ముద్ర వేసిన దిగ్గజాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2015వ సంవత్సరం బాలీవుడ్‌కు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆ ఒక్క ఏడాదిలోనే ఇద్దరు మహానటులు అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్ పద్మ విభూషణ్‌ను స్వీకరించారు.
వీళ్ళతో పాటు ప్రముఖ రంగస్థల, సినీ నటి జోహ్రా సెహగల్‌కు 2010లో ఈ అవార్డు లభించింది. వీళ్ళ ప్రస్థానం భారతీయ సినిమాకు ఎంతో స్ఫూర్తిదాయకం. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకులలో సత్యజిత్ రే ప్రముఖులు. అలాగే రజనీకాంత్ పేరు కూడా మరువలేనిది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా గొప్పతనాన్ని చాటిచెప్పిన దర్శకుడు సత్యజిత్ రే 1976లోనే పద్మ విభూషణ్‌ను అందుకున్నారు. ఇక తన స్టైల్, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌కు 2016లో ఈ గౌరవం దక్కింది. మొత్తంగా చూస్తే అక్కినేని, సత్యజిత్ రే వంటి పాతతరం దిగ్గజాల నుంచి నేటి చిరంజీవి, రజినీ వరకు పద్మ విభూషణ్ గ్రహీతలందరూ భారతీయ కళామ్మతల్లి ముద్దుబిడ్డలే. నటన, దర్శకత్వం, గానం.. ఇలా ఏ రంగంలో ఉన్నా, తమ ప్రతిభతో దేశం గర్వించేలా చేసినందుకు భారత ప్రభుత్వం ఈ పురస్కారాలతో వారిని సమున్నతంగా గౌరవించింది. వీరి విజయ ప్రస్థానం భావితరాలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది.