భూ సర్వే కాదు.. వివాదాల పుట్ట..!

వైసీపీ ప్రభుత్వంలో చేసింది భూ సర్వే కాదని, వివాదాల పుట్ట అంటూ ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి

  • Written By:
  • Publish Date - January 24, 2026 / 08:00 PM IST

వైసీపీ ప్రభుత్వంలో చేసింది భూ సర్వే కాదని, వివాదాల పుట్ట అంటూ ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, గత ప్రభుత్వంలో సృష్టించిన భూ వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. డేటా ట్రాన్స్‌ఫర్ లో విఫలమై వెబ్లాండ్ వ్యవస్థను సర్వనాశనం చేసిన క్రెడిట్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది అంటూ మండిపడ్డారు. అర్హత లేని 5.74 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేసి భూ దోపిడీకి తెరలేపారని కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు.

పట్టాదారు పుస్తకాలపై ఫోటోల కోసం రూ. 700 కోట్లు ఖర్చు చేయడం దుర్మార్గమని విమర్శించిన ఆయన.. భూ రీసర్వే అంశంపై జగన్ రెడ్డి క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదమన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ వ్యవస్థపై కనీస అవగాహన లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ ప్రయోగం వల్ల ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భూ యజమానులు, సామాన్య రైతులు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.

ముఖ్యంగా విజయనగరం జిల్లాను ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ గత 18 నెలలుగా తాను వ్యక్తిగతంగా జరిపిన సమీక్షలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని మీడియా సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. జిల్లాలో ఉన్న మొత్తం రెవెన్యూ సమస్యల్లో 70 శాతం కేవలం జగన్ సర్కార్ అస్తవ్యస్తంగా నిర్వహించిన రీసర్వే వల్లే తలెత్తాయన్నారు. బ్రిటిష్ కాలం నాటి పారదర్శక రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు స్పష్టంగా ఉన్నప్పటికీ.. అధికారులకు శిక్షణ ఇవ్వకుండా, తగిన సమయం కేటాయించకుండా బలవంతంగా రీసర్వేను రుద్దడం వల్ల వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడిందని ఆరోపించారు.

వలస వెళ్లిన రైతుల భూములను సైతం పట్టించుకోకుండా లక్షలాది జాయింట్ ఎల్పిఎం (LPM)లు సృష్టించి, రైతుల ఆస్తులను చిక్కుల్లో నెట్టేశారని మండిపడ్డారు. వెబ్లాండ్-1లో ఉన్న పూర్తి భూ చరిత్రను పట్టించుకోకుండా, హడావుడిగా వెబ్లాండ్-2కి మారడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని విమర్శించారు. సుమారు 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేసిన గత ప్రభుత్వం, అందులో 5.74 లక్షల ఎకరాల అర్హత లేని భూములను చేర్చడం వారి దురుద్దేశాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ప్రజల ఆస్తులపై, సర్వే రాళ్లపై తన ఫోటోలు వేయించుకోవడానికి రూ. 700 కోట్ల ప్రజాధనాన్ని తగలేసిన జగన్ రెడ్డికి, ప్రజల ఆస్తి హక్కుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేసారు.