ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఆయనదేనా.. కాంగ్రెస్‌కు మైండ్‌బ్లాంక్‌ షాక్ తప్పదా…?

మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. జనరల్‌ ఎలక్షన్‌ను తలపించాయ్‌. గెలుపు ఎవరిది అనేది తేలడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.

  • Written By:
  • Publish Date - March 3, 2025 / 04:45 PM IST

మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. జనరల్‌ ఎలక్షన్‌ను తలపించాయ్‌. గెలుపు ఎవరిది అనేది తేలడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ తరఫున నరేందర్‌‌‌‌రెడ్డి.. బీఎస్పీ తరఫున ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి అంజిరెడ్డి పోటీ చేశారు. నామినేషన్లు పూర్తయ్యే నాటికి కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్యే పోటీ ఉంటుందని అనుకున్నా.. ప్రసన్న హరికృష్ణ అనూహ్యంగా మిగతా ఇద్దరు క్యాండిడేట్లకు ప్రధాన ప్రత్యర్థిగా మారారు. రాష్ట్రంలో బీసీ నినాదం బలపడుతుండడం, చివరి రెండు రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు హరికృష్ణ కోసం పని చేయడం ఆయనకు ప్లస్‌‌‌‌ అయినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థిని నిలబెట్టలేదు.

కరీంనగర్‌‌‌‌ మాజీ మేయర్ సర్దార్‌‌‌‌ రవీందర్‌‌‌‌ సింగ్‌‌‌‌… ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌‌‌‌రావు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించినా.. వారికి నిరాశే మిలిగింది. ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్‌‌‌‌ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నించినా అవకాశం రాలేదు. ఆ తర్వాత బీఆర్ఎస్ తరపున పోటీ చేయాలని కూడా ప్లాన్‌ చేశారు. అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. ఎన్నికల తేదీ దగ్గర పడే వరకు సైలెంట్‌‌‌‌గా ఉన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హైకమాండ్‌.. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు ప్రసన్న హరికృష్ణకు ఇంటర్నల్‌‌‌‌గా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. అదే నిజం అయితే.. ఫలితాలు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై.. అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎన్నికలకు 5 నెలల ముందు నుంచే ప్రచారం చేయడం, సుమారు లక్షన్నర గ్రాడ్యుయేట్ ఓటర్లను ఎన్‌‌‌‌రోల్‌‌‌‌ చేయించడం, కాంగ్రెస్‌‌‌‌ తరఫున బరిలో నిలవడం, సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రచారం తనకు కలిసి వస్తుందని నరేందర్‌‌‌‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక కేంద్రమంత్రులు కిషన్‌‌‌‌రెడ్డి, బండి సంజయ్‌‌‌‌తో పాటు ముగ్గురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు చేసిన ప్రచారంతో పాటు… ఉత్తర తెలంగాణలో పెరిగిన బలం, నిరుద్యోగులు, ఉద్యోగుల్లో బీజేపీ పట్ల సానుకూల ధోరణి తనను గెలిపిస్తుందని.. బీజేపీ తరపున బరిలో ఉన్న అంజిరెడ్డి భావిస్తున్నారు. ఇక బీఎస్పీ మద్దతుతో పోటీలో ఉన్న ప్రసన్న హరికృష్ణ గ్రాఫ్‌‌‌‌ చివరి వారం రోజుల్లో అనూహ్యంగా పెరిగింది. బీసీ వాదం ఆయనకు కలిసొచ్చింది. దీంతో పాటు కాంపిటీటివ్‌‌‌‌ బుక్స్‌‌‌‌ రచయితగా పేరున్న వ్యక్తి కావడంతో.. గ్రాడ్యుయేట్లకు అందులోనూ ప్రధానంగా నిరుద్యోగులకు ఆయన బాగా కనెక్ట్‌‌‌‌ అయ్యారు. చివరి నిమిషంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పరోక్ష మద్దతు కూడా కలిసొచ్చినట్లయింది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఫస్ట్‌‌‌‌ ప్రయారిటీ ఓటేసిన వారు కూడా సెకండ్‌‌‌‌ ప్రయారిటీ కింద హరికృష్ణకే ఓటేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది.