Spl story: వర్మను సెట్ చేసిన పవన్.. హ్యాండ్ వదలని జనసేనాని

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ పడిందా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ అలక వీడారా.. వర్మపై జనసేన నేతలు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చుకున్నారా..

  • Written By:
  • Publish Date - April 26, 2025 / 01:00 PM IST

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ పడిందా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ అలక వీడారా.. వర్మపై జనసేన నేతలు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చుకున్నారా.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల నాటి నుంచి టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య అధిపత్య పోరు నడుస్తోంది. కూటమిలో ఒప్పందం కారణంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం సీటును టీడీపీ వదులుకుంది. చంద్రబాబు హామీతో నియోజకవర్గం ఇంఛార్జ్‌ వర్మ వెనక్కి తగ్గారు. దీంతో పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా పవన్ కల్యాణ్ 70 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు.

ఎన్నికల తర్వాత వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామన్న హామీని చంద్రబాబు కాస్త పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు వర్మకు అవకాశం దక్కలేదు. దీంతో వర్మ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జనసేన నేత నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. పిఠాపురంలో పవన్ గెలుపు పూర్తిగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పిఠాపురం ప్రజలే కారణమని.. ఇది కాకుండా ఎవరైనా తమ వల్లే అనుకుంటే.. వారి ఖర్మ అంటూ పరోక్షంగా వర్మ గురించి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా నాగబాబు తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలకు వర్మను ఆహ్వానించలేదు. దీనిపై జనసేన, టీడీపీ నేతల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది.

అయితే వీటికి పవన్ కల్యాణ్ బ్రేక్ వేసినట్లు కనిపిస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కల్యాణ్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమాలకు వర్మను ప్రత్యేకంగా ఆహ్వానించారు పవన్. అధికారిక కార్యక్రమం అయినప్పటికీ.. వర్మను తన పక్కనే ఉంచుకున్నారు పపన్ కల్యాణ్. ప్రతి కార్యక్రమంలో వర్మ కూడా తన పక్కనే ఉండేలా పవన్ చూసుకున్నారు. పిఠాపురం వచ్చిన వెంటనే.. ముందుగా వర్మకు షేక్ హ్యాండ్ ఇచ్చారుపవన్. ఆ తర్వాత నుంచి ప్రతి చోట వర్మకు ప్రాధాన్యం దక్కేలా పవన్ చూసుకున్నారు. వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన పవన్.. అక్కడే ఉన్న వర్మతో నవ్వుతూ ముచ్చటించారు. అలాగే అక్కడికి వచ్చిన పార్టీల నేతలను పలకరించారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని గంపెడాశ పెట్టుకున్న వర్మ.. చివరి నిమిషంలో తన పేరు లేకపోవడంతో కాస్త అసహనానికి గురయ్యారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా అంటూ వెల్లడించారు. ఇక రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఓ వివాహ వేడుకలో కూడా పాల్గొన్న వర్మ.. అక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం చంద్రబాబుతో ముచ్చటించారు. తాజాగా పవన్ టూర్‌లో కూడా వర్మ ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ రాకతో టీడీపీ, జనసేన పార్టీల నేతల మధ్య విభేదాలు తొలగినట్లే కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.