ఏడాదిన్నర లో పాదయాత్ర చేస్తానని వైసీపీ అధినేత జగన్ ప్రకటించేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ చేసిన ప్రకటన ఒక్కసారి పార్టీ వర్గాల్లో జోష్ తీసుకొచ్చింది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేస్తే ఎన్నికల్లో గెలుపు గ్యారంటీ అనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఇప్పటివరకు అది 90% నిజమని రుజువైంది. ఈసారి కూడా జగన్ పాదయాత్ర అతనికి గెలుపుని సాధించి పెడుతుందా?
పాదయాత్రకు బ్రాండ్ అంబాసిడర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి.2003 ఏప్రిల్ 9న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం…. చేవెళ్ల నుంచి ప్రారంభించి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు 11 జిల్లాల్లో 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ప్రజా ప్రస్థానం పేరిట 60 రోజులకు పైగా సాగిన ఈ పాదయాత్ర వల్లే 2004, 2009లో కాంగ్రెస్ ఏపీలో రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పాదయాత్ర వల్లే తాను ప్రజల…. ముఖ్యంగా రైతుల కష్టాలు తెలుసుకోగలిగేనని ఉచిత విద్యుత్ పై సంతకం పెట్టిన నాడు వైయస్ చెప్పుకున్నారు.
పాదయాత్ర వల్లే వైయస్ ముఖ్యమంత్రి అయ్యారని బలంగా నమ్మిన చంద్రబాబు 63 ఏళ్ల వయసులో 2012లో వస్తున్న మీకోసం పేరిట 117 రోజుల పాదయాత్ర చేశారు.13 జిల్లాల్లో 2,340 కిలోమీటర్లు నడిచి బాబు వైయస్ రికార్డును బ్రేక్ చేశారు. పాదయాత్ర సెంటిమెంట్ వర్కౌట్ అయింది.2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.అప్పటినుంచి జనంలోనూ పొలిటికల్ పార్టీల్లోనూ పాదయాత్ర సెంటిమెంట్ మరింత బలపడి పోయింది.
వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల కూడా మరో ప్రజా ప్రస్థానం పేరిట రోజుల్లో 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్ర లో 14 జిల్లాలు 107 అసెంబ్లీ లు 1700 కు పైగా గ్రామాలు తిరిగారు. అప్పటికి అదే రికార్డు.
ఆ తర్వాత 2017 నవంబర్ 6న జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాత రికార్డులను తిరగ రాశారు.341 రోజులపాటు జరిగిన ఈ పాదయాత్ర కడప నుంచి శ్రీకాకుళం వరకు సాగింది. ఈ జగన్ ఈ పాదయాత్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ,చంద్రబాబు షర్మిల, రికార్డులను మొత్తం అధిగమించారు. తన పాదయాత్రలో సుమారు రెండు కోట్ల మంది ప్రజల్ని కలుసుకున్నట్లు జగన్ చెప్పారు.2516 గ్రామాలు తిరిగి 124 పబ్లిక్ మీటింగులు నిర్వహించారు.
పాదయాత్ర ప్రభావంతో 151 సీట్ల తో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.ఎన్నికల్లో విజయం సాధించాలంటే పాదయాత్ర చేయాల్సిందే అనే నమ్మకం పొలిటికల్ పార్టీల్లో బలంగా ఏర్పడిపోయింది. ఈసారి చంద్రబాబు నాయుడు పక్కనపెట్టి ఆయన కుమారుడు లోకేష్ కుప్పం నుంచి ప్రారంభించి ఇచ్చాపురం వరకు నాలుగు వేల కిలోమీటర్ల పైచిలుకు పాదయాత్ర చేశారు. యువ గళం పేరుతో జరిగిన ఈ పాదయాత్ర లో లోకేష్ 150 నియోజకవర్గాలు తిరిగారు. సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయింది. 20 24 ఎన్నికల్లో… టిడిపి సారధ్యంలోని కూటమి మునుపెన్నడూ లేనంతగా 164 సీట్లతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏపీలో పాదయాత్ర చేసిన ప్రతి నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
తెలంగాణలో కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అయింది.2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేత లు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ఇద్దరూ తెలంగాణలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించింది. రేవంత్ సీఎం, బట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీ తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల మాత్రమే ఇప్పటివరకు పాలిటిక్స్ లో సక్సెస్ కాలేకపోయారు. ఆమె రెండుసార్లు పాదయాత్ర చేశారు. కానీ ఇప్పటివరకు ఫలితం దక్కలేదు.ఇక జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నర తర్వాత ఏపీలో పాదయాత్రకు చేస్తానని ప్రకటించారు. మరి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది వేచి చూడాలి.