ఒక్క ఒక్క మ్యాచ్..ఎన్నో రికార్డులు రాయ్ పూర్ లో భారత్ అదుర్స్

రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి.

  • Written By:
  • Publish Date - January 24, 2026 / 05:15 PM IST

రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. కివీస్ ముందుగా బ్యాటింగ్ చేసి 209 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి.టీ20 క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని అత్యంత వేగంగా ఛేదించిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 209 పరుగులను మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారత్ పూర్తి చేసింది. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్ పేరిట ఉండేది.

చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, న్యూజిలాండ్‌పై వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. ఇషాన్ మొత్తం 32 బంతుల్లో 76 పరుగులు చేసి విజయానికి పునాది వేశాడు. అలాగే దాదాపు 463 రోజుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫేవరెట్ ఫార్మాట్‌లో అర్ధశతకం బాదాడు. ఓపెనర్లు త్వరగా ఔటైప్పటికీ, సూర్య తనదైన శైలిలో ఆడి జట్టును గెలిపించాడు.

ఇదిలా ఉంటే భారత గడ్డపై టీమిండియా ఆడిన 100వ టీ20 మ్యాచ్ ఇది కావడం విశేషం. ఈ మైలురాయి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది.ఇక అర్ష్‌దీప్ సింగ్ ‘అన్‌వాంటెడ్’ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడి బౌలింగ్  టీమిండియాకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలింది.  అర్ష్‌దీప్ సింగ్ తన మొదటి ఓవర్‌లోనే 18 పరుగులు ఇచ్చాడు. భారత్ తరపున టీ20ల్లో తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా ఆయన ఓచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. మరోవైపు 200 ప్లస్ లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా ఛేదించడం ఇది 6వ సారి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది.