ఐపీఎల్ అంటేనే రికార్డులకు చిరునామా.. కేవలం గ్రౌండ్‌లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్‌లోనూ రికార్డుల మీద రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. బ్రాడ్ కాస్టింగ్ రైట్స్‌తో పాటు ఫ్రాంచైజీల విలువ విషయంలో సరికొత్త రికార్డులను చూస్తూనే ఉన్నాం. తాజాగా ఐపీఎల్ రాజస్థాన్ రాయ ల్స్ ఫ్రాంచైజీ కోసం భారీ స్థాయిలో బిడ్ దాఖలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా రూ.11,956 కోట్లతో రాయల్స్ ఫ్రాంచైజీ కోసం నాలుగు బిడ్లు దాఖలయ్యాయి. వీటిలో ఇప్పటికే రాజస్థాన్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టిన కల్ సొమానీ భారీ ధరకు బిడ్ దాఖలు చేశారు.అలాగే టైమ్స్ ఇంటర్నెట్, బ్లాక్‌స్టోన్, కార్లుల్ గ్రూప్ కూడా బిడ్లు దాఖ లు చేసి రేసులో నిలిచాయి.
ఒకవేళ ఈ డీల్ కుదిరితే మాత్రం ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఫ్రాంచైజీగా రాజస్థాన్ రాయల్స్ రికార్డులకెక్కుతుంది. అటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కూడా అమ్మకం కోసం రెడీ అయింది. ఆ ఫ్రాంచైజీ రూ.17,500 కోట్ల వరకూ బిడ్డింగ్ ఆశిస్తోంది. దాని కంటే ముందే రాయల్స్ ఫ్రాంచైజీ డీల్ ముగిసేలా కనిపిస్తోంది. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ గుజరాత్ టైటాన్స్ అత్యధిక ధర కలిగిన ఫ్రాంచైజీగా ఉంది. టొరంటో గ్రూప్ దీనిలో 67 శాతం వాటాను రూ.5,025 కోట్లకు కొనుగోలు చేయగా.. మొత్తం ఫ్రాంచైజీ విలువ రూ.7,500 కోట్లుగా అంచనా వేశారు.
ఇటీవలి సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ మైదానంలో పెద్దగా రాణించకపోయినా, వ్యాపార పరంగా మాత్రం ఆ జట్టు విలువ పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఐపీఎల్‌పై చూపిస్తున్న ఆసక్తే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ వద్ద ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, టైగర్ గ్లోబల్ కూడా భాగస్వాములుగా ఉన్నాయి. అందుకే అమెరికన్ ఇన్వెస్టర్ కాల్ సోమాని సహా టైమ్స్ ఇంటర్నెట్, బ్లాక్‌స్టోన్, కార్లైల్ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు ఈ డీల్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ఈ విక్రయ ప్రక్రియను అంతర్జాతీయ సంస్థ రైన్ గ్రూప్ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ గతంలో చెల్సీ, మాంచెస్టర్ యునైటెడ్ వంటి క్లబ్బుల విక్రయాలను కూడా పర్యవేక్షించింది. రాజస్థాన్ రాయల్స్‌కు వచ్చిన బిడ్లతో ఆర్సీబీ యజమానులు మార్కెట్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌స్టోన్, కార్లైల్ వంటి సంస్థలు రెండు జట్లపైనా ఆసక్తి చూపుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.