బంగారం ధర…చూస్తుంటే లక్షన్నర మార్క్ క్రాస్ చేసింది. లక్ష టచ్ అయినప్పుడే అమ్మో అనుకుంటే..తర్వాత రోజుల వ్యవధిలోనే లక్షాపాతిక దాటింది.. ఆ తర్వాత లక్షన్నర దాటేసింది. మధ్య మధ్యలో సడెన్‌గా వేలలో తగ్గి సర్‌ప్రైజ్ చేసింది. కేంద్ర బడ్జెట్ తర్వాత పుత్తడి ధరలు కుప్పకూలుతాయా ? నిపుణులు ఏమంటున్నారు ?
పసిడి ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. లక్షా 60వేల మార్కును క్రాస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత పసిడి ధరలను ప్రభావితం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర రికార్డు స్థాయిలో 5,000 డాలర్లకు, వెండి 100డాలర్లకి చేరుకోవడమే ప్రధాన కారణం.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడంతో దిగుమతి ఖర్చులు భారమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర సుమారు 1.6 లక్షల మార్కును తాకడంతో పేద ప్రజలు వివాహాలు, పండుగలకు నగలు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తున్న వేళ, అంతర్జాతీయ మార్కెట్ సెగలు పసిడిని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. దీంతో అందరి చూపు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 వైపు మళ్లింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా, వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో…ఉపశమన చర్యలు చేపట్టాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ విజ్ఞప్తి చేస్తోంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని హేతుబద్ధీకరించడం వల్ల దేశీయంగా ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. తద్వారా సామాన్యులకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆభరణాలపై ఉన్న 3 శాతం GSTని 1.25శాతం లేదా 1.5శాతానికి తగ్గించాలని డిమాండ్ ఉంది. ఇది జరిగితే మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది.
2.5శాతం వడ్డీ, పన్ను మినహాయింపులతో బాగా ఆదరణ పొందిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని పెట్టుబడిదారులు కోరుతున్నారు. డిజిటల్ బంగారంపై అవగాహన పెంచాలని బంగారం వ్యాపారులు కోరుతున్నాయి. పన్ను మినహాయింపులు ఇస్తే, ఇళ్లలో ఉన్న బంగారం ఆర్థిక ప్రవాహంలోకి వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని అభిప్రాయపడుతున్నారు. బంగారం కేవలం అలంకార వస్తువు మాత్రమే కాదు, భారతీయులకు అది ఒక ఆర్థిక భద్రత. రాబోయే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం, GST విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటేనే మధ్యతరగతి ఇండ్లలో మళ్లీ పసిడి వెలుగులు నిండుతాయి.
2025 బంగారానికి స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. 2026లో బంగారం దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. దీంతో చాలా మంది బంగారంపై పెట్టుబడి పెట్టారు. దాంతో డిమాండ్ మరింత పెరిగి, ధర ఆకాశాన్ని తాకింది. ఆల్‌టైమ్ రికార్డు ధరలను నెలకొల్పుతూ గోల్డ్ దూసుకెళ్తోంది. బంగారం ధర కుప్పకూలుతుందని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. ఈ బ్రోకరేజ్ సంస్థ 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు 5,400 డాలర్లుగా అంచనా వేసింది. రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం, బడా కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే గ్రీన్‌ల్యాండ్ చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇవన్నీ కలిసి పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో గోల్డ్‌మన్ సాచ్స్ తాజా నివేదికను వెల్లడించింది. 2026లో సగటున 60 టన్నుల బంగారం కొనుగోళ్లు జరగవచ్చని గోల్డ్‌మన్ అంచనా వేసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ శక్తి సమీకరణాల్లో మార్పుల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు తమ రిజర్వులను వైవిధ్యపరచాలని చూస్తున్నాయి.ఇక ప్రపంచ ద్రవ్య విధానాలపై అనిశ్చితి గణనీయంగా తగ్గితే, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉంది. అదే జరిగితే బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని గోల్డ్‌మన్ అంచనా వేస్తోంది.