Top story: రికార్డ్‌ స్థాయిలో పెరిగిన గోల్డ్‌ రేటు ఇక సామాన్యులు కొనడం కష్టమే

మార్కెట్‌లో బంగారం ధర కంట్రోల్‌ లేకుండా పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గినట్టే కనిపించినా ఇవాళ మరోసారి భారీగా ధర పెరిగి గోల్డ్‌ లవర్స్‌కు నిద్ర లేకుండా చేస్తోంది.

  • Written By:
  • Updated On - January 23, 2026 / 09:19 PM IST

మార్కెట్‌లో బంగారం ధర కంట్రోల్‌ లేకుండా పరుగులు పెడుతోంది. నిన్న కాస్త తగ్గినట్టే కనిపించినా ఇవాళ మరోసారి భారీగా ధర పెరిగి గోల్డ్‌ లవర్స్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. వెయ్యో రెండు వేలో కాదు.. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా లక్షా 60 వేలకు చేరింది బంగారం ధర. నిజానికి ఈ నెలాఖరుకు ఈ స్థాయిలో రేట్లు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కానీ మూడో వారంలోనే రికార్డ్‌ స్థాయికి గోల్డ్‌ ధర చేరింది.

మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. ఉదయం మార్కెట్‌ ప్రారంభమైన కాసేపటికే ధరలు ఆకాశాన్నంటాయి. ఈ నెలాఖరుకు బంగారం ధర లక్షా 60 వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు. వాళ్లు చెప్పినట్టే రికార్డ్‌ స్థాయి ధర నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా 5,400 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర నేరుగా లక్షా 59 వేల 710కి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 4,950 ధర పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా లక్షా 46 వేల 400కు చేరింది. మరోపక్క వెండి కూడా బంగారంతో ధరలో పోటీ పడుతోంది. కేజీ మీద వెండి ధర ఏకంగా 20 వేలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండికి 3 లక్షలా 60 వేలు ధర పలుకుతోంది.

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అమెరికా కొత్తగా ప్రతిపాదించిన పన్నులు మరియు ‘గ్రీన్‌లాండ్’ వివాదం కారణంగా.. యూరోపియన్ దేశాలతో వాణిజ్య యుద్ధం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు భయపడి స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసి, సురక్షితమైన బంగారంలో పెడుతున్నారు. ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా వెళ్తుందన్న భయాలతో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒడిదుడుకులకు లోనవ్వడం కూడా దేశీయంగా రేట్లు పెరగడానికి కారణమైంది.

పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర్లో ఉండటంతో ఈ ధరల పెరుగుదల సామాన్యుడిపై, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత నెలలో అనుకున్న బడ్జెట్‌కి, ఇప్పటి రేట్లకి పొంతన లేకుండా పోయింది. తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటడంతో.. పెళ్లికి 5 తులాలు కొనాలి అనుకున్న వాళ్లు 3 తులాలతోనే సరిపెట్టుకుంటున్నారు. కొంత మంది భారీ ఆభరణాల బదులు, తక్కువ బరువుతో వచ్చే ‘లైట్ వెయిట్’ డిజైన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది కొత్త బంగారం కొనలేక, ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని ఇచ్చి ఎక్స్‌ఛేంజ్‌లో కొత్తవి చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పట్లో బంగారం ధరలు తగ్గే అవకాశాలు కనిపించడంలేదని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గితే తప్ప బంగారం ధరలు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు. రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 2 లక్షల మార్క్‌ కూడా దాటే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఓవరాల్‌గా బంగారం ఇప్పుడు కేవలం ఆభరణం మాత్రమే కాదు.. ఖరీదైన ఆస్తిగా మారిపోయింది. పెళ్లిళ్ల కోసం బంగారం కొనాలనుకునే వాళ్లు రేట్లు తగ్గుతాయని ఎదురుచూడటం కంటే, బడ్జెట్ చూసుకుని అవసరానికి తగ్గట్టు కొనడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు.