రజనీ ఫ్యాన్స్ కు వింత అనుభవం.. 37 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న సినిమా.. రీ రిలీజ్ కాదు న్యూ రిలీజ్..!

ఎంత పెద్ద హీరో అయినా కొన్నిసార్లు వాళ్ల వాళ్ల కెరీర్లో కొన్ని సినిమాలు బయటికి రాకుండా అలాగే ఆగిపోతాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ తో బాక్స్ లో నుంచి సినిమా బయటికి రాదు.

  • Written By:
  • Publish Date - January 25, 2026 / 09:00 PM IST

ఎంత పెద్ద హీరో అయినా కొన్నిసార్లు వాళ్ల వాళ్ల కెరీర్లో కొన్ని సినిమాలు బయటికి రాకుండా అలాగే ఆగిపోతాయి. ఫైనాన్షియల్ ఇష్యూస్ తో బాక్స్ లో నుంచి సినిమా బయటికి రాదు. అలా రజినీకాంత్ కెరీర్లో కూడా ఒకసారి జరిగింది. ఆ సినిమా ఇప్పుడు విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల పాత హిట్ సినిమాలను 4కే క్వాలిటీతో ముస్తాబు చేసి విడుదల చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో మాత్రం ఒక వింత సంఘటన జరగబోతోంది. ఇది రీ-రిలీజ్ కాదు.. అలాగని కొత్తగా షూటింగ్ జరుపుకున్న సినిమా అంతకన్నా కాదు. సరిగ్గా 37 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకుని.. ల్యాబ్ కే పరిమితమైన ఓ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఈ చిత్రం థియేటర్లలోకి వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమా పేరు హమ్ మే షెహెన్ షా కౌన్. రజినీకాంత్ కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు… అంటే 1988లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో రజినీతో పాటు బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, లెజెండరీ నటుడు శత్రుఘ్న సిన్హా వంటి భారీ తారాగణం నటించారు. ప్రముఖ దర్శకుడు హర్మేష్ మల్హోత్రా ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే అనివార్య కారణాల వల్ల.. ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల ఈ సినిమా షూటింగ్ దశలోనే ఆగిపోవడమో లేదా పోస్ట్ ప్రొడక్షన్లో నిలిచిపోవడమో జరిగింది. ఇన్నాళ్లూ ల్యాబ్‌లో ఉండిపోయిన ఈ సినిమా రీల్స్ దుమ్ము దులిపి, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో రీ-మాస్టర్ చేస్తున్నారు. ఈ ఆసక్తికర పరిణామంపై నిర్మాత రాజా రాయ్ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీద మేం ఎప్పుడూ ఆశ కోల్పోలేదు. హమ్ మే షెహెన్ షా కౌన్ ఎన్నో ఎదురు దెబ్బలను, ఏళ్ల తరబడి నిశ్శబ్దాన్ని భరించింది. ఇన్నాళ్ల తర్వాత ప్రేక్షకులను ఈ సినిమా కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపాడు.

కేవలం పాత ప్రింట్‌ను అలాగే రిలీజ్ చేయకుండా.. ఇప్పటి ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా విజువల్స్, ఆడియోను మెరుగుపరిచి థియేటర్లలోకి తీసుకురానున్నారు. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు.
గతంలో కూడా ఇలాంటి అరుదైన సంఘటనలు మన తెలుగు ఇండస్ట్రీలో చోటుచేసుకున్నాయి. దివంగత నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రతిబింబం సినిమా కూడా దాదాపు 40 ఏళ్ల తర్వాత విడుదలైంది. 1982లో షూటింగ్ జరుపుకున్న ఆ చిత్రం.. 2022లో థియేటర్లలోకి వచ్చింది. అప్పట్లో అది ఒక సంచలనమే. ఇప్పుడు రజినీకాంత్ సినిమా కూడా అదే బాటలో నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఇది పాత తరం జ్ఞాపకాలను, కొత్త తరం టెక్నాలజీతో కలిపే ఒక అరుదైన ప్రయత్నం అని చెప్పవచ్చు.

మొత్తానికి రజినీ ఫ్యాన్స్‌కి ఇది ఊహించని సర్ప్రైజ్. ఇప్పటి రజినీ వేరు, 80ల నాటి రజినీ స్టైల్ వేరు. ఆ వింటేజ్ లుక్, ఆనాటి మేనరిజమ్స్‌ను ఇప్పుడు వెండితెరపై కొత్త సినిమాలా చూడటమనేది అభిమానులకు కచ్చితంగా ఒక కిక్ ఇస్తుంది. అక్కినేని సినిమా విషయంలో జరిగినట్టే, రజినీ సినిమా కూడా ఆడియన్స్‌ను అలరిస్తుందా..? లేక కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందా? అనేది చూడాలి. ఏదేమైనా 37 ఏళ్ల తర్వాత ఒక సినిమా వెలుగు చూడటం అనేది రికార్డుల్లో నిలిచిపోయే విషయమే.