రౌడీ బాయ్‌కి అసలైన పరీక్ష.. యాస మారింది.. రాత మారుతుందా.. ఆంధ్ర వెళ్తున్న తెలంగాణ కుర్రోడు..!

విజయ్ దేవరకొండ మొదటి నుంచి తెలంగాణ భాషకు బ్రాండ్ అంబాసిడర్ గానే ఉన్నాడు. ఆయన సినిమాల్లో మాట్లాడే యాసకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

  • Written By:
  • Publish Date - January 25, 2026 / 07:00 PM IST

విజయ్ దేవరకొండ మొదటి నుంచి తెలంగాణ భాషకు బ్రాండ్ అంబాసిడర్ గానే ఉన్నాడు. ఆయన సినిమాల్లో మాట్లాడే యాసకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా విజయ్ డైలాగులకు అంత క్రేజ్ రావడానికి ఆయన తెలంగాణ యాస కారణం. చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ భాషను అంత స్పష్టంగా మాట్లాడగలిగే హీరో ఇచ్చాడు అంటూ పండగ చేసుకుంటున్నారు అభిమానులు. సినిమా ఏదైనా కూడా యాస ఒకేలా ఉంది అనే విమర్శలు కూడా విజయ్ దేవరకొండ మీద చాలాసార్లు వచ్చాయి. అది పోగొట్టుకోవడానికి ఇప్పుడు రాయలసీమ, గోదావరి నేపథ్యంలో సినిమాలు చేస్తున్నాడు విజయ్. రౌడీ కెరీర్ గ్రాఫ్ చూస్తే ఆయన సూపర్ స్టార్‌డమ్‌లో మేజర్ క్రెడిట్ ఆయన బాడీ లాంగ్వేజ్‌తో పాటు ఆయన మాట్లాడే తెలంగాణ యాసకే దక్కుతుంది. పెళ్లి చూపులు నుండి మొన్నటి కింగ్డమ్ వరకు.. విజయ్ తన డైలాగ్ డెలివరీలో ఆ లోకల్ తెలంగాణ ఫ్లేవర్‌ను వదల్లేదు. సహజత్వానికి దగ్గరగా ఉండే ఆ శైలి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.

ఇప్పుడు విజయ్ తన కంఫర్ట్ జోన్ నుండి పూర్తిగా బయటకు రావడానికి సిద్ధమయ్యాడు. రాబోయే రెండు సినిమాల్లో ఆయన రెండు పూర్తి భిన్నమైన తెలుగు మాండలికాలను ట్రై చేస్తున్నారు. ఇప్పటి వరకు తనదైన అర్బన్ తెలంగాణ స్లాంగ్‌తో నెట్టుకొచ్చిన రౌడీ బాయ్.. మొదటిసారిగా ఆంధ్రా ప్రాంతంలోని రెండు ప్రధానమైన యాసలపై పట్టు సాధించాల్సి ఉంది. ఇది కేవలం డైలాగులు చెప్పడమే కాదు, ఆ ప్రాంతపు నేటివిటీని తన గొంతులో పలికించాల్సిన పెద్ద బాధ్యత. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న రౌడీ జనార్ధన సినిమా కోసం విజయ్ గోదావరి యాసను ఎంచుకున్నాడు. గోదావరి యాస అంటేనే అందులో ఒక రకమైన వెటకారం, ఇష్టంతో కూడిన కోపం, ఒక విలక్షణమైన ఫ్లో ఉంటాయి. తెలంగాణ యాసలో ఉండే గరుకుదనం కాకుండా.. గోదావరి యాసలో సాగదీస్తూ మాట్లాడే తీరును విజయ్ ఎలా అందిపుచ్చుకుంటాడనేది ఆసక్తికరం. ఈ యాసలో పట్టు దొరికితే, ఫ్యామిలీ ఆడియన్స్‌కి విజయ్ మరింత దగ్గరయ్యే అవకాశముంది.

మరోవైపు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రాబోతున్న పాన్- ఇండియా పిరియాడిక్ డ్రామా కోసం విజయ్ రాయలసీమ యాసలో మాట్లాడాల్సి ఉంది. రాయలసీమ మాండలికం అంటేనే గంభీరత్వం, పౌరుషానికి ప్రతీక. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉండబోతోందని సమాచారం. ఆ ఇంటెన్సిటీకి తగ్గట్టుగా సీమ యాసలో డైలాగులు పేలితేనే సినిమాకు హైప్ వస్తుంది. ఈ యాసను డీల్ చేయడం విజయ్ కెరీర్‌లోనే అత్యంత కష్టమైన టాస్క్ అని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇదొక కీలకమైన మలుపు. తనను కేవలం తెలంగాణ యాసకే పరిమితం అని విమర్శించే వారికి సమాధానం చెప్పడానికి ఇది సరైన సమయం. ఈ రెండు సినిమాల్లోనూ విజయ్ ఆయా యాసలను, డిక్షన్‌ను పర్ఫెక్ట్‌గా పలికించగలిగితే, ఆయన స్టార్ ఇమేజ్ రెట్టింపు అవ్వడమే కాకుండా, ఒక సంపూర్ణమైన నటుడిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడు. విజయ్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుందాం.