Top story:వైఎస్‌ నుంచి అజిత్ పవార్‌ దాకా… రాజకీయ నేతలను భయపెడుతున్న విమాన ప్రమాదాలు

పలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఈ దుర్ఘటనల్లో రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సినీ ప్రముఖులు సహా అనేకమంది ప్రముఖులు తమ ప్రాణాలను కోల్పోయారు.

  • Written By:
  • Publish Date - January 29, 2026 / 10:27 AM IST

పలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు దేశాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఈ దుర్ఘటనల్లో రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, సినీ ప్రముఖులు సహా అనేకమంది ప్రముఖులు తమ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇప్పటివరకు జరిగిన అనేక విమాన ప్రమాదాల్లో ఎంతో మంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న బెల్–430 హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. మాజీ లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భీమవరం నుంచి బయలుదేరిన ప్రైవేట్ హెలికాప్టర్ కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని చెరువులో కూలిపోయింది.

తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్‌ ఎయిర్​ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ దుర్మరణం పాలయ్యారు. లండన్‌లో నివసిస్తున్న ఆయన కుమార్తె రాధికను కలిసేందుకు జూన్ 12న అహ్మదాబాద్‌ నుంచి విజయ్ రూపానీ బయలుదేరారు. అయితే టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం మెడికల్‌ కాలేజీ హాస్టల్‌పై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని 242 మంది పాటు విద్యార్థులు కలిపి సుమారు 270 పైనే ఉన్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలో 2001 సెప్టెంబర్ 30న కన్నుమూశారు.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు ఎన్నికల సభకు వెళ్తుండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయన ప్రయాణిస్తున్న 10 సీట్ల ప్రైవేట్ విమానం మైన్‌పురి సమీపంలో కూలిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు 2011 ఏప్రిల్ 30న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తవాంగ్ నుంచి ఇటానగర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో వెస్ట్ కామెంగ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ 1980 జూన్ 23న విమాన ప్రమాదంలో మరణించారు. 1977లో ఎన్నికల ప్రచార సమయంలో ఆయనపై జరిగిన హత్యాయత్నం నుంచి తప్పించుకున్నప్పటికీ, ఈ ప్రమాదం నుంచి మాత్రం బయటపడలేకపోయారు.

భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. సూలూర్ నుంచి వెల్లింగ్టన్‌కు వెళ్తుండగా, తమిళనాడులోని కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన భార్యతో పాటు మరో 11 మంది మరణించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, హరియాణా మంత్రి ఓం ప్రకాశ్ జిందాల్ 2005 మార్చి 31న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తుండగా, ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. మేఘాలయ రాష్ట్ర మంత్రి సైప్రియన్ సంగ్మా సహా మరో తొమ్మిది మంది 2004 సెప్టెంబర్ 22న పవన్ హాన్స్ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గువాహటి నుంచి షిల్లాంగ్‌కు వెళ్తుండగా, బారాపానీ సరస్సు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది.

భారత అణు కార్యక్రమానికి పునాది వేసిన మహానుభావుడు డాక్టర్ హోమీ భాభా. 1966 జనవరి 24న ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్–101 స్విట్జర్లాండ్‌లోని మోంట్ బ్లాంక్ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. పైలట్లు, జెనీవా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సమన్వయ లోపమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది. ప్రముఖ సినీ నటి సౌందర్య 2004 ఏప్రిల్ 17న విమాన ప్రమాదంలో మృతి చెందారు. బెంగళూరు జక్కూర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి కరీంనగర్‌కు బయలుదేరిన సెస్నా సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. అప్పటికి ఏడు నెలల గర్భిణిగా ఉన్న ఆమెతో పాటు నలుగురు ఈ ప్రమాదంలో మరణించారు.