Top story: కవిత దెబ్బకి ఒక్కటైన బావ బామ్మర్దులు

లైఫ్ లో ఒకేసారి నలుగురుతో యుద్ధం చేయకూడదు. ఆ నలుగురు ఒక్కటైపోతే.... అది మనకే దెబ్బ. ఈ చిన్న లాజిక్ ని మిస్సైంది.... తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.

  • Written By:
  • Publish Date - January 24, 2026 / 09:30 PM IST

లైఫ్ లో ఒకేసారి నలుగురుతో యుద్ధం చేయకూడదు. ఆ నలుగురు ఒక్కటైపోతే…. అది మనకే దెబ్బ. ఈ చిన్న లాజిక్ ని మిస్సైంది…. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. ఒకేసారి కుటుంబంలో అందరినీ టార్గెట్ చేసింది. అన్నా, బావ…. ఇద్దరినీ చెడుగుడు ఆడుకుంది. దీంతో ఇద్దరికీ కామన్ ఎనిమీ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వుకున్న కేటీఆర్ హరీష్ రావు లు స్వీయ రక్షణ కోసం ఇప్పుడు ఒక్కటై పోయారు. దీంతో బి ఆర్ఎస్ లో గ్రూపుల గోల తగ్గి ఆ పార్టీకి మరింత బలం పెరిగింది.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత …. తిరుగుబాటు జెండా ఎగరేసిన వెంటనే హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరినీ టార్గెట్ చేసింది. కానీ ఎందుకో రాజీ పడి సంతోష్ రావు ను వదిలిపెట్టింది. సంతోష్ రావు ప్లేస్ లో సొంత అన్న కేటీ రామారావుపై తన గురి పెట్టింది. ఇక నిత్యం హరీష్ రావు అవినీతి, గ్రూపు రాజకీయాలు పై విమర్శలు గుప్పిస్తూ ఉండేది. అలాగే బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఇటీవల ఆరోపణలు విమర్శల జోరు పెంచింది. సోషల్ మీడియాలో తనపై రాతలు రాయించేది కేటీఆర్ఏనని పరోక్షంగా విమర్శిస్తూ వచ్చింది కవిత. అలాగే ఈ కార్ రేస్, ఫోన్ టాపింగ్ వ్యవహారాల్లోనూ కేటీఆర్ పై కవిత సెటైర్లు వేశారు.

పరిస్థితిని గమనించిన బావా బామ్మర్దులు ఇద్దరు కవిత వల్ల జరిగిన డ్యామేజ్ ని ఉమ్మడిగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. తమలో తాము కుమ్ములాటలతో కవిత మాటలకు ఊతమిచ్చినట్లు అవుతుందని, తామిద్దరూ బలంగా నిలబడితే , పార్టీకి జోష్ వస్తుంది…. కార్యకర్తల మనస్తైర్యం పెరుగుతోంది కనుక వ్యక్తిగత అజెండాలు, స్వార్ధాలు, గ్రూపులు పక్కనపెట్టి తామిద్దరూ ఒక్కటేనని, కెసిఆర్ కుడి ఎడమలము తామేనని బయట ప్రపంచానికి తెలియ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు కేటీఆర్. పార్టీని విచ్ఛిన్నం చేసే కవిత మాటలు జనం నమ్మకూడదు అంటే తామిద్దరూ కలిసి ఉండాలి, వీళ్ళ కుటుంబ అంతా ఒక్కటే అనే భావన జనంలోకి వెళ్లాలి అని డిసైడ్ అయ్యారు బావ బామ్మర్దులు.

ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావును విచారణకు పిలిచినప్పుడు…. కేటీఆర్ ఆయనకు బాసటగా నిలబడ్డారు. హరీష్ రావు ఫోన్ టాపింగ్ విచారణకు వెళ్ళినప్పుడు భారీ బల ప్రదర్శన చేశారు. ఇక కేటీఆర్ కి ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు రమ్మని నోటీసులు వచ్చినప్పుడు కూడా హరీష్ రావు చెలరేగిపోయారు. కేటీఆర్ విచారనికి వెళ్ళినప్పుడు తనదైన శైలిలో వెంట ఉండి పంపించారు. విచారణ పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టారు. గడచిన 15 రోజులుగా టిఆర్ఎస్ లో కనిపిస్తున్న పరిణామాలు విశ్లేషిస్తే ఆ పార్టీ క్రమంగా బలోపేతం అవుతుంది,,,… అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

దీనికి ప్రధాన కారణం కవితే. కవిత వీళ్ళందర్నీ ఒకేసారి టార్గెట్ చేయడం ద్వారా…. అందర్నీ యాక్టివ్ చేశారు. కవిత చేసే ఆరోపణలు జనం నమ్మకుండా ఉండాలి అంటే, తామంతా ఒక్కటిగా ఉండాలని…. పార్టీ బలంగా ఉంది, ఐకమత్యంగా ఉంది మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదు అనే విషయం జనంలోకి వెళ్లాలని కేటీఆర్ హరీష్ రావులు నిర్ణయించుకున్నట్లు ఉంది. అందుకే పర్సనల్ జెండాలు పక్కన పెట్టారు. ప్రతి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి చెలరేగిపోతున్నారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో కూడా కొత్త ఉత్సాహం వచ్చింది.

కవిత రోజు ప్రెస్ మీట్ లు పెట్టి కెసిఆర్ ని, కేటీఆర్ ని, హరీష్ రావు ని ఎంత ఆడిపోసుకున్న… అది జనంలోకి పెద్దగా వెళ్ళటం లేదు. కవిత వాయిస్ వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అనేది జనంలో చాలామంది నమ్ముతున్నారు. కవిత మాటల్లో నిజాయితీ లేకపోవడం, హరీష్ రావులకు బాగా కలిసి వచ్చింది. పాడిందే పాట పాచిపళ్ళ దాసరి అన్నట్లుగా కవిత రోజు ఒకే అజెండాతో, కేటీఆర్ హరీష్ రావు లను టార్గెట్ చేసి ప్రెస్ మీట్ లు పెట్టడం వల్ల జనానికి బోర్ కొట్టేసింది. ఇంతకుమించి కవిత ఏం మాట్లాడలేదు అనేది అర్థం అయిపోయింది. దీన్ని అడ్వాంటేజ్ చేసుకున్నారు బావా బామ్మర్దులు ఇద్దరు.

పార్టీలో గ్రూపులు వర్గాలు లేవని తామంతా ఒక్కటేనని, ఈ సంక్షోభాన్ని కూడా కలిసి ఎదుర్కొంటున్నామని జనంలోకి వెళ్లేటట్లు చేశారు. కవిత కాంగ్రెస్ని పెద్దగా విమర్శించకపోవడం, సీఎం రేవంత్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలపై స్పందించకపోవడం ఇవన్నీ చూసిన వాళ్ళకి ఆమె టార్గెట్ కేటీఆర్ హరీష్ రావే అని అర్థమైంది. కానీ ఫైనల్ గా కవిత పుణ్యమా అని పార్టీలో మెయిన్ పిల్లర్స్ అయినా వీళ్ళిద్దరూ ఒకటైపోయారు. కవిత విమర్శలు ఆరోపణలకు భయపడి కొట్టుకు చస్తే అసలుకే మోసం వస్తుందని గుర్తించారు. కవిత ఏదో చేయాలని అనుకుంటే, అది చివరికి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అయింది.