ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. న్యూజిలాండ్ సిరీస్‌లో తొలి మూడు టీ20ల్లో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ టెన్ లోకి దూసుకొచ్చాడు. ఏకంగా ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 717 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకాడు. కొంతకాలంగా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ రేటింగ్ పాయింట్లను మరింత పెంచుకొన్నాడు. అభిషేక్ ప్రస్తుతం 929 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మిగతా భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 2, శివమ్ దూబే 9, రింకూ సింగ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని వరుసగా 53, 59, 68 స్థానాలకు ఎగబాకారు. గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరంగా ఉన్నా తిలక్ వర్మ మూడో స్థానాన్ని నిలుపుకున్నాడు.
మిగతా దేశాలకు చెందిన బ్యాటర్లలో మార్క్రమ్ 9 స్థానాలు ఎగబాకి 20వ ర్యాంకులోనూ, బ్రాండన్ కింగ్ 15 స్థానాలు ఎగబాకి 35వ స్థానంలోనూ, గ్లెన్ ఫిలిప్స్ 18 స్థానాలు మెరుగై 44వ స్థానానికి చేరుకున్నారు. అలాగే సెదిఖుల్లా అటల్ , ర్యాన్ రికెల్టన్ , దర్విష్ రసూల్, హెట్‌మైర్ తమ తమ స్థానాలను భారీగా మెరుగుపరుచుకున్నారు. బౌలర్ల విషయానికొస్తే.. టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు ఎగబాకి 13 ర్యాంకులోనూ , రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19వ స్థానంలోనూ, హార్దిక్ పాండ్యా 18 స్థానాలు ఎగబాకి 59వ ర్యాంకులోనూ నిలిచారు. వరుణ్ చక్రవర్తి మినహా టాప్-10లో మరో భారత బౌలర్ లేడు.
రషీద్ ఖాన్, హసరంగ 2,3 స్థానాలు నిలబెట్టుకున్నారు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 16, కుల్దీప్ యాదవ్ 25 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా మూడో స్థానంలోనూ, శివమ్ దూబే 12వ ర్యాంకులోనూ నిలిచారు. టాప్-2గా సికందర్ రజా, సైమ్ అయూబ్ కొనసాగుతున్నారు. ప్రస్తుతం కివీస్ తో సిరీస్ లో మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండడంతో ఈ ర్యాంకింగ్స్ లోనూ వచ్చే వారం మరిన్ని మార్పులు జరిగే అవకాశముంది.