కివీస్ తో సిరీస్ కు తిలక్ వర్మ ఔట్, ప్రపంచకప్ కు ఫిట్ అయ్యే ఛాన్స్…!

టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. ప్రస్తుతం అన్ని జట్లు మెగా టోర్నీకి ముందు ప్రిపరేషన్ గా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 27, 2026 / 10:10 AM IST

టీ20 వరల్డ్ కప్ గడువు దగ్గరపడుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి మొదలుకానుంది. ప్రస్తుతం అన్ని జట్లు మెగా టోర్నీకి ముందు ప్రిపరేషన్ గా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతూ బిజీగా గడుపుతున్నాయి. టీమిండియా కూడా కివీస్ తో సిరీస్ లో అదరగొడుతోంది. అదే సమయంలో పలువురు ఆటగాళ్ల గాయాలు ఇబ్బందిగా మారాయి. తాజాగా ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని కొందరు ఆటగాళ్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ విషయంలో ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోంది. భారత జట్టు మేనేజ్మెంట్. అతనిపై ఎటువంటి రిస్క్ చేయకూడదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి రెండు టీ20లకూ అతన్ని దూరం పెట్టింది. దీంతో ఈ మ్యాచ్ లల్లో తిలక్ ఆడట్లేదు.

ఫలితంగా ఈ సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్ భారత జట్టులో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. గాయపడ్డ తిలక్ వర్మకు ప్రత్యామ్నాయంగా శ్రేయాస్ అయ్యర్ మొదటి మూడు టీ20లకు మాత్రమే ఎంపికయ్యాడు. ఇప్పుడు సిరీస్‌ మొత్తం జట్టుతోనే కొనసాగుతాడు. తిలక్ వర్మ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆచితూచి వ్యవహరిస్తోండటమే దీనికి కారణం. ప్రపంచ కప్‌కు ముందు అతని విషయంలో ఎలాంటి రిస్క్‌ తీసుకోవడం లేదు.

ప్రస్తుతం గాయం నుంచి తిలక్ వర్మ పూర్తిగా కోలుకున్నాడు. వందశాతం ఫిట్ నెస్ సాధించాడు. అయినప్పటికీ టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా మేనేజ్మెంట్ మాత్రం అతనిపై రాజీ పడట్ లేదు. గాయం తిరగబెడితే టీ20 వరల్డ్ కప్ మొత్తానికీ దూరం కావాల్సి వస్తుందనే ఆందోళన జట్టు మేనేజ్ మెంట్ లో ఉంది. దీంతో న్యూజిలాండ్ సిరీస్ నుంచి అతన్ని తప్పించింది. తిలక్ వర్మ ఈ నెల ప్రారంభంలో విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బెంగాల్‌పై చివరిసారిగా ఆడాడు.