KTRకు సజ్జనార్‌ కౌంటర్‌…

ఫోన్‌ ట్యాపింక్‌ కేసు వ్యవహారంలో రాజకీయ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆరోపించారు.

  • Written By:
  • Publish Date - January 21, 2026 / 03:31 PM IST

ఫోన్‌ ట్యాపింక్‌ కేసు వ్యవహారంలో రాజకీయ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఈ విచారణ జరుగుతోంది అనడంలో నిజం లేదన్నారు. విచారణకు సంబంధించిన విషయాలు చెప్తూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు సజ్జనార్‌. ”పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హరీష్ రావును జనవరి 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్‌ ప్రశ్నించింది. సాయంత్రం తన కుమారుడికి విమాన ప్రయాణం ఉన్నందున, హరీష్ రావు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సిట్.. విచారణను ముగించి ఆయన వెళ్ళేందుకు అనుమతించింది.

ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించరాదని, ప్రభావితం చేయరాదని లేదా జోక్యం చేసుకోరాదని ఆయనకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. అవసరమైతే తదుపరి విచారణ నిమిత్తం మళ్లీ పిలుస్తామని తెలియజేశాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. హరీష్ రావును విచారించింది కేవలం ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాత్రమే. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం, వారిపై నిఘా ఉంచడం వంటి తీవ్రమైన ఆరోపణలపై ఈ దర్యాప్తు జరుగుతోంది.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చ్‌ నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన ఛార్జిషీటు కూడా దాఖలు చేశాం. కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై ఇంకా లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హరీష్ రావును విచారిస్తున్నారంటూ జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని, అటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నామంటూ పోస్ట్‌ చేశారు సజ్జనార్‌. హరీష్‌ రావు సిట్‌ విచారణకు వెళ్లిన తరువాత ప్రెస్‌మీట్‌లో KTR పరోక్షంగా సజ్జనార్‌కు కౌంటర్‌ ఇచ్చారు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో సజ్జనార్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.