స్పోర్ట్స్ షూ కూడా కొనుక్కోలేని పరిస్థితి… కష్టాల మధ్య ఎదిగిన షకీబ్ హుస్సేన్…!

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ షకీబ్ హుస్సేన్‌కు ఇంతకంటే గొప్ప ఐపీఎల్ అరంగేట్రం మరొకటి ఉండదేమో. ఉప్పల్ స్టేడియంలో బుల్లెట్ లాంటి బంతులతో చెలరేగాడు. ఐపిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్‌ జైత్రయాత్రకు సన్ రైజర్స్ బ్రేక్ వేసింది..

Post Published By: dialnews
Updated : 16 April 2026, 10:30 PM IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ షకీబ్ హుస్సేన్‌కు ఇంతకంటే గొప్ప ఐపీఎల్ అరంగేట్రం మరొకటి ఉండదేమో. ఉప్పల్ స్టేడియంలో బుల్లెట్ లాంటి బంతులతో చెలరేగాడు. ఐపిఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్‌ జైత్రయాత్రకు సన్ రైజర్స్ బ్రేక్ వేసింది... ఇందులో షకీబ్ బౌలింగ్‌ ది కీలకపాత్ర. తన ఐపీఎల్ కెరీర్‌ను ఇంత అద్భుతంగా మొదలుపెడతానని అతను కూడా ఊహించి ఉండడు.హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల దృష్టిని ప్రఫుల్ హింగే తన తొలి ఓవర్‌లోనే నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఆకర్షించాడు. కానీ అతడితో పాటే ఈ మ్యాచ్ ద్వారా ఆరంగేట్రం చేసిన షకీబ్ కూడా అదరగొట్టాడు. హింగే మాదిరిగానే షకీబ్ కూడా తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు తీసి హైదరాబాద్ విజయంలో అంతే ప్రభావం చూపాడు.

సన్ రైజర్స్ బౌలింగ్‌లో రెండో ఓవర్ వేయడానికి వచ్చిన హుస్సేన్, నాలుగో బంతికే ఫామ్‌లో ఉన్న ఆర్ఆర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను అవుట్ చేశాడు. తన మొదటి ఓవర్‌లోనే తొలి ఐపీఎల్ వికెట్ తీసి రాజస్థాన్ రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. షకీబ్ హుస్సేన్ 2004 డిసెంబర్ 14న బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో పుట్టాడు. అతనిది చాలా పేద కుటుంబం... తండ్రిదండ్రులు నిరుపేద రైతు కూలీలు. దీంతో షకీబ్ కుటుంబానికి ఆర్థిక సహకారం అందించేందుకు క్రికెటర్ గా మారాడు.. విలేజ్ క్రికెట్ ఆడుతూ రోజుకు 500 వరకు సంపాదించేవాడు. ఇలా కుటుంబం కోసం క్రికెటర్ గా మారిన షకీబ్ దీన్నే ప్రొఫెషన్ గా ఎంచుకున్నాడు... అయితే ఈ ప్రయాణంలో అతడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఒకసారి స్పోర్ట్స్ షూస్ లేవని బాధపడడంతో... అతని తల్లి వెంటనే తన బంగారు నగలు అమ్మి షూస్ కొనిచ్చింది. ఇలా కొడుకు కోసం ఆ తల్లిదండ్రులు... పేరెంట్స్ కోసం కొడుకు ఎన్నో త్యాగాలు చేశారు.

షకీబ్ తన క్రికెట్ ప్రయాణాన్ని టెన్నిస్ బాల్‌తో ప్రారంభించాడు. కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న మొత్తాలు సంపాదించేవాడు. అతని మెంటార్స్, కోచ్ రాబిన్ సింగ్ ప్రోత్సాహంతో లెదర్ బాల్ క్రికెట్‌కు మారాడు. వాళ్లే అతని బౌలింగ్‌కు మెరుగులు దిద్ది, పోటీ క్రికెట్‌లో రాణించేలా తీర్చిదిద్దారు. 2021 బీహార్ క్రికెట్ లీగ్‌లో నిలకడగా గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి స్థానికంగా వార్తల్లో నిలిచాడు. ఇది అతనికి దేశవాళీ క్రికెట్‌లోకి దారి చూపింది. అక్టోబర్ 2022లో ఇండోర్‌లో ఆంధ్రా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2022-23లో బీహార్ తరఫున అరంగేట్రం చేశాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ 20 లక్షలకు కొనుగోలు చేయడంతో తొలి ఐపీఎల్ కాంట్రాక్ట్ అందుకున్నాడు. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. అయినా నిరాశపడకుండా దేశవాళీ క్రికెట్‌లో బాగా రాణించాడు. రంజీ ట్రోఫీలో, అరుణాచల్ ప్రదేశ్‌పై తన తొలి ఫస్ట్-క్లాస్ ఐదు వికెట్ల ప్రదర్శనతో సహా మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు.గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో తన ఐదో మ్యాచ్‌లో SRH తరఫున అరంగేట్రం చేసి, రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో వెంటనే తన ముద్ర వేశాడు.

Published : 
  • 16 April 2026, 10:30 PM IST