ఈ AI గ్యాడ్జెట్‌ ఉంటే జంతువులతో మాట్లాడొచ్చు…!

మన ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లులు చేసే శబ్దాలు, వాటి కదలికలను బట్టి అవి ఏం కోరుకుంటున్నాయో మనం ఓ అంచనాకు వస్తుంటాం. కానీ అవి తమ మనసులోని మాటను స్పష్టంగా మనకు చెబితే ఎలా ఉంటుంది?

Post Published By: dialnews
Updated : 27 May 2026, 10:22 AM IST

మన ఇళ్లలో పెంచుకునే కుక్కలు, పిల్లులు చేసే శబ్దాలు, వాటి కదలికలను బట్టి అవి ఏం కోరుకుంటున్నాయో మనం ఓ అంచనాకు వస్తుంటాం. కానీ అవి తమ మనసులోని మాటను స్పష్టంగా మనకు చెబితే ఎలా ఉంటుంది? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలోని కల్పనలా అనిపించినా, చైనాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ దీనిని సుసాధ్యం చేస్తోంది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఒక చిన్న 'ఏఐ ఆధారిత స్మార్ట్ కాలర్ బెల్ట్' ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అలీబాబా క్లౌడ్ ఏఐ సాంకేతికతతో పనిచేసే ఈ సరికొత్త గ్యాడ్జెట్.. జంతువుల అరుపులు, వాటి శరీర కదలికలను నిశితంగా విశ్లేషిస్తుంది.

జంతువులు ఆకలితో ఉన్నాయా, సంతోషంగా ఉన్నాయా లేక కోపంగా ఉన్నాయా అనేది సుమారు 95 శాతం కచ్చితత్వంతో ఈ పరికరం కనిపెడుతుందని తయారీదారులు చెబుతున్నారు. ఇందులో అమర్చిన మైక్రోఫోన్లు, మోషన్ సెన్సార్లు జంతువుల హావభావాలను కేవలం 1.2 సెకన్లలోనే గ్రహించి, 'నన్ను ఒంటరిగా వదిలేయ్', 'నాతో ఆడుకో' వంటి స్పష్టమైన వాక్యాల రూపంలోకి మారుస్తాయి. ఈ సమాచారాన్ని స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా యజమానులకు వినిపిస్తుంది.కేవలం జంతువుల భావాలను మనుషులకు చేరవేయడమే కాకుండా, యజమానులు మాట్లాడే మాటలను కూడా జంతువులకు సులభంగా అర్థమయ్యే 'పెట్ ఫ్రెండ్లీ' శబ్దాలుగా ఈ గ్యాడ్జెట్ అనువదిస్తుంది. దీని ద్వారా పెంపుడు జంతువులతో ఇరువైపులా సంభాషణలు సాగించవచ్చు. ఈ ఏఐ మోడల్‌ను తీర్చిదిద్దేందుకు దాదాపు 10 లక్షల జంతువుల వాయిస్ డేటా శాంపిల్స్‌ను సేకరించి శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 14 వేలకు లభిస్తున్న ఈ గ్యాడ్జెట్‌కు విశేష స్పందన లభిస్తోంది. బుకింగ్స్ ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే 10 వేల మందికి పైగా దీనికోసం ముందస్తు ఆర్డర్లు ఇచ్చేశారు. ఒకవైపు ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ, మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. "మనుషుల మాటలనే ఏఐ ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోతోంది, అలాంటిది కుక్కలు, పిల్లుల భాషను ఎలా కనిపెట్టేసింది?" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. టెక్ నిపుణులు సైతం దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు, పరిశోధన పత్రాలు లేకుండా 95% కచ్చితత్వం ఉందని కంపెనీ ఎలా నిర్ధారిస్తుందని ప్రశ్నిస్తున్నారు. జంతువుల భావాలను అంత సులభంగా మాటల్లోకి మార్చడం సాధ్యం కాదని కొట్టిపారేస్తున్నారు.

 

Published : 
  • 27 May 2026, 10:22 AM IST