1987వ సంవత్సరంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనం నమోదైంది. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ నసీబ్ ను తెలుగులో వెంకటేష్, అర్జున్, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా త్రిమూర్తులు పేరుతో రీమేక్ చేశారు. ప్రముఖ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ మ్యాజిక్‌ను టాలీవుడ్‌లో రిపీట్ చేయాలనే సంకల్పంతో రూపొందిన ఈ సినిమా.. అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఒక పాట టాలీవుడ్ చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోయింది. హిందీ నసీబ్ చిత్రంలోని జాన్ జానీ జనార్ధన్ పాటలో బాలీవుడ్ టాప్ స్టార్స్ అందరూ మెరిసి ప్రేక్షకులను అలరించారు. సరిగ్గా అదే తరహాలో తెలుగు ప్రేక్షకులకు కూడా కనువిందు చేయాలని సుబ్బరామిరెడ్డి ప్లాన్ చేశారు.
టాలీవుడ్ లెజెండ్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూపించాలని ఆయన గట్టిగా ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం.. అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో ఆ కాంబినేషన్ కుదరలేదు. దీంతో నిర్మాత ఒక వినూత్న ఆలోచన చేశారు. లెజెండ్స్ కుదరకపోయినా.. వాళ్ళ వారసులను రంగంలోకి దించి మెగా ప్లాన్ అమలు చేశారు. అలా ఒకే మాట ఒకే బాట.. అనే పాటలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేష్ ఒకేసారి తెరపై కనిపించి ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు. నేటి కాలంలో ఇలాంటి క్రేజీ మల్టీస్టారర్ ఊహించడం కష్టం కానీ.. ఆ రోజుల్లోనే ఈ నలుగురు యంగ్ స్టార్స్ ఒకే పాటలో సందడి చేయడం ఒక అద్భుతమనే చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో ఈ నలుగురు అగ్ర హీరోలు కలిసి కనిపించిన ఏకైక చిత్రంగా త్రిమూర్తులు రికార్డు సృష్టించింది. సినిమా విడుదల కావడానికి ముందే ఈ నలుగురు హీరోలు కలిసి ఉన్న అరుదైన ఫోటోను ప్రెస్ కి విడుదల చేశారు.
ఈ ఒక్క ఫోటో అప్పట్లో టాలీవుడ్‌లో వైరల్ అయ్యి.. సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది. అభిమానుల్లో నెలకొన్న ఈ విపరీతమైన క్యూరియాసిటీ వల్ల సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి. థియేటర్ల వద్ద జనం పోటెత్తారు, కేవలం ఆ ఒక్క పాట కోసమే రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారంటే అతిశయోక్తి కాదు. పబ్లిసిటీ పరంగా సుబ్బరామిరెడ్డి చేసిన ఈ ప్రయోగం సూపర్ హిట్ అయింది. అయితే ఇంతటి భారీ తారాగణం.. క్రేజ్ ఉన్నప్పటికీ త్రిమూర్తులు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఓపెనింగ్స్ అదిరిపోయినా.. కథనంలో వేగం తగ్గడం వల్ల ఫైనల్‌గా ఈ సినిమా యావరేజ్ మార్కుతో సరిపెట్టుకుంది. అయినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లను ఒకే వేదికపై చూడాలనే సగటు సినిమా ప్రేమికుడి కలని నిజం చేసిన చిత్రంగా త్రిమూర్తులు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ ఫోటో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉండటం ఈ సినిమా ప్రత్యేకతకు నిదర్శనం.