భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా బోర్డర్. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన బోర్డర్ 2పై ముందు నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది కేవలం ఒక సినిమాగా కాకుండా ఒక ఎమోషనల్ జర్నీగా నిలిచింది. దర్శకుడు అనురాగ్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం అద్భుతం. తాజాగా ఈ చిత్రం విడుదలైంది.. 1971 యుద్ధం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూనే, సైనికుల వీరత్వం, త్యాగం వాళ్ల మధ్య ఉండే సోదరభావాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించారు. భారీ స్కేల్‌లో తీసిన ఈ సినిమా.. పాత క్లాసిక్ ఆత్మను ఏమాత్రం కోల్పోకుండా, కొత్తతరం ప్రేక్షకులను కూడా మెప్పించేలా రూపొందింది. సీక్వెల్ క్రేజ్ ఎలాగూ ఉంది.. దానికితోడు సినిమా కూడా అదిరిపోయిందనే టాక్ వినిపిస్తుంది. బోర్డర్ 2 ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ సన్నీ డియోల్.. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, థియేటర్లలో ఒక రకమైన వైబ్రేషన్ మొదలవుతుంది.
సన్నీ గొంతు విప్పితే వచ్చే గర్జన, చెప్పే డైలాగులు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. చాలామంది అనుకున్నట్లు ఇది గెస్ట్ రోల్ కాదు.. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు సన్నీ డియోల్ పాత్ర సాగుతుంది. ఆయన పాత సినిమాల్లోని ఆవేశం, దేశభక్తి ఈ పాత్రలో స్పష్టంగా కనిపిస్తాయి. వింటేజ్ సన్నీ డియోల్‌ని మళ్ళీ చూడాలనుకునే వాళ్లకు ఇది పండగే అంటున్నారు ఆడియన్స్. మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. వరుణ్ ధావన్ తన కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయనలోని ఇంటెన్సిటీ, ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇక దిల్జీత్ దోసాంజ్ తనదైన శైలిలో నటిస్తూనే, అక్కడక్కడా తన కామిక్ టైమింగ్‌తో రిలీఫ్ ఇచ్చాడు. యువ నటుడు అహాన్ శెట్టి సీనియర్ల సరసన చాలా కాన్ఫిడెంట్‌గా నటించాడు. మేధా రాణా, మోనా సింగ్ వంటి యాక్టర్స్ కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. బలమైన కథ, దానికి తగ్గట్టుగా రాసిన పాత్రలు నటీనటుల నుంచి ఉత్తమ నటనను రాబట్టాయనేది ప్రేక్షకులు చెప్తున్న మాట.
టెక్నికల్‌గానూ బోర్డర్ 2 సినిమా అత్యున్నత ప్రమాణాలతో ఉంది. వార్ సీక్వెన్సులు, బాంబు పేలుళ్లు, ఏరియల్ యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్‌గా, ఉత్కంఠభరితంగా ఉన్నాయి. యాక్షన్ కేవలం స్టైల్ కోసం కాకుండా, కథలో ఎమోషన్‌ను పెంచేలా డిజైన్ చేశారు. పాత బోర్డర్ సినిమాలోని ఐకానిక్ పాటలైన ఘర్ కబ్ ఆవోగే, జాతే హుయే లమ్హో రీక్రియేటెడ్ వెర్షన్లు గుండెను బరువెక్కిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యుద్ధ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. షార్ప్‌గా రాసిన దేశభక్తి డైలాగులు ఈ చిత్రానికి ప్రధాన బలం. చివరగా బోర్డర్ 2 అనేది ప్రతీ భారతీయుడి గుండెను ఉప్పొంగేలా చేసే ఒక పవర్ ఫుల్ సినిమా. ఇది మన కోసం ప్రాణాలర్పించిన సైనికులకు ఒక ఘనమైన నివాళి. తరాలతో సంబంధం లేకుండా, చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ చూడాల్సిన చిత్రం ఇది అంటున్నారు విశ్లేషకులు. సినిమా చూసి బయటకు వస్తున్నప్పుడు, మన సైనికుల పట్ల గౌరవం, దేశం పట్ల ప్రేమ మనసులో నిండిపోతాయి. జనవరి 26 వీకెండ్ ఉండటంతో భారీ వసూళ్ళు ఖాయం అయిపోయాయి. ఇది గానీ క్లిక్ అయితే 1000 కోట్లు వస్తాయంటున్నారు ట్రేడ్ పండితులు.