నేనేది కావాలని అనను.. అలా అనాలని రాసిపెట్టి ఉంటుంది అంటూ బండ్ల గణేష్ కి ఒక ఫేమస్ డైలాగు ఉంటుంది గుర్తుందా..? మంచు విష్ణును చూస్తే అదే అనిపిస్తుంది. పాపం మనోడు ఏది కావాలని అనడు కానీ ఏది మాట్లాడినా వెంటనే వైరల్ అవుతుంటాయి. తాజాగా అయిన ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలు కూడా ఇలాగే వైరల్ అవుతున్నాయి. కన్నప్ప సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఏకంగా రెండు నెలలు వాయిదా వేశాడు మంచు విష్ణు. రిలీజ్ ఇంకా చాలా రోజులు ఉన్నా కూడా ఇప్పటి నుంచే ప్రమోషన్ మొదలుపెట్టాడు. పాజిటివ్ కంటే నెగిటివ్ ప్రమోషన్ తొందరగా జనాల్లోకి వెళుతుంది అనుకుంటున్నాడో ఏమో తెలియదు కానీ.. మనోడు మాట్లాడే మాటలు మాత్రం అప్పుడప్పుడు అభిమానులకు మంట పుట్టించేలా ఉంటాయి. అసలు విషయం ఏంటంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి మంచు విష్ణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవ్వడమే కాకుండా ఆయన మీద కోపం కూడా తెప్పిస్తున్నాయి.
ఏదో పాపంలే అని మా ప్రభాస్ నీ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తే.. నువ్వేమో బయటికి వచ్చి మా హీరో గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంటూ మంచు విష్ణుపై మండిపడుతున్నారు ప్రభాస్ అభిమానులు. కన్నప్ప కాస్టింగ్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ పై కొన్ని కామెంట్స్ చేశాడు మంచు విష్ణు. సినిమాలో చాలామంది లెజెండ్స్ నటించారని.. అయితే ప్రభాస్ మాత్రం తన దృష్టిలో లెజెండ్ కాదు అంటూ కామెంట్ చేశాడు. ప్రభాస్ ఇంకా లెజెండ్ అవ్వడానికి చాలా టైముందని.. తన దృష్టిలో ఆయన ఒక మంచి నటుడు మాత్రమే అని చెప్పాడు మంచు విష్ణు. మోహన్ లాల్ లెజెండ్ అని.. ప్రభాస్ ఇంకా లెజెండ్ అయ్యే క్రమంలోనే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన లెజెండ్ అవునా కాదా అనేది పక్కన పెడితే ఇలాంటి సిచువేషన్ లో ఈ కామెంట్స్ అవసరం లేదు అనేది చాలామంది చెబుతున్న మాట. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇండియాలో నెంబర్ వన్ హీరో ప్రభాస్. మార్కెట్ పరంగా ఆయనకు తిరుగులేదు. 1000 కోట్ల మార్కు కూడా ఈజీగా అందుకుంటున్నాడు. అంతేకాదు.. రాజమౌళి ముద్రతో హిందీలో ఇమేజ్ తెచ్చుకున్నా.. ఆ తర్వాత మార్కెట్ మాత్రం తన సినిమాలతోనే పెంచుకున్నాడు ప్రభాస్.
బాలీవుడ్ లో కూడా ఇప్పుడు రెబల్ స్టార్ సినిమాలకు కనీసం 300 నుంచి 500 కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇన్ని చేసినప్పుడు మా హీరో లెజెండ్ కాదా అని ప్రశ్నిస్తున్నారు ప్రభాస్ అభిమానులు. అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ వజ్రోత్సవాలు వేడుకలో మోహన్ బాబు కూడా ఇలా లెజెండ్, సెలబ్రిటీ మీద చాలా పెద్ద గొడవ చేశాడు. 50 సినిమాలు నిర్మించాను.. 500 కు పైగా సినిమాలలో నటించాను నేను కాదా లెజెండ్.. నన్ను సెలబ్రిటీ అంటారేంటి అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయాడు కలెక్షన్ కింగ్. యాదృచ్ఛికమో ఏమో కానీ ఇప్పుడు మంచు విష్ణు కూడా సేమ్ టాపిక్ మీద మాట్లాడాడు. అయినా మంచు వారి ఫ్యామిలీకి ఈ లెజెండ్ అనే పదం అచ్చి రావట్లేదు. ఎప్పుడు వాడినా కూడా ట్రోలింగ్ వస్తూనే ఉంది. అందుకే పదాలు వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటారు పెద్దలు.