అవకాశం కోసం పడుకుంటారు.. సెక్స్ కావాలి అంటారు.. చిరంజీవి వ్యాఖ్యలను తప్పుబట్టిన సింగర్ చిన్మయి..!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ వేదికపై ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి

  • Written By:
  • Updated On - January 27, 2026 / 05:16 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఓ వేదికపై ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. సినిమా పరిశ్రమ అద్దం లాంటిదని.. మనం మంచిగా ఉంటే అటు వైపు నుంచి కూడా మంచే వస్తుందని.. కాస్టింగ్ కౌచ్ అనేది పెద్దగా లేదన్న అర్థంలో ఆయన మాట్లాడాడు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద తీవ్రంగా స్పందించింది. చిరంజీవి అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని చెబుతూ.. కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఒక చేదు నిజమని సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టింది. చిరంజీవి అద్దం ఉదాహరణను చిన్మయి తప్పు బట్టింది. ఇండస్ట్రీ అద్దం లాంటిది కాదు. ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారు. మరి ఆయన అలా ప్రవర్తించమని నేనేమైనా అడిగానా? లేదా నా ప్రవర్తన దానికి కారణమా? అని ఆమె సూటిగా ప్రశ్నించింది.

వేధింపులు అనేవి మనం ఎలా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉండవని, బాధితులను నిందించేలా మాట్లాడటం సరికాదని ఆమె తన ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది. వేధించేవారికి బాధితుల ప్రవర్తనతో సంబంధం లేదని ఆమె గట్టిగా వాదించింది. కాస్టింగ్ కౌచ్ అనేది ప్రస్తుతం పరిశ్రమలో అదుపులో లేని సమస్యగా మారిందని చిన్మయి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ ప్రతిభ కంటే కమిట్మెంట్ ముఖ్యమైపోయిందని ఆమె పేర్కొంది. ఇక్కడ సెక్స్ కు నో చెబితే అవకాశాలు రావు. కేవలం పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకునే సంస్కృతి ఇక్కడ ఉంది అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇది కేవలం పుకారు కాదని, ఎంతో మంది మహిళలు అవకాశాల కోసం లేదా ఉన్న అవకాశాలను కాపాడుకోవడం కోసం ఎదుర్కొంటున్న నగ్న సత్యమని ఆమె తేల్చి చెప్పింది. అయితే చిరంజీవిపై తనకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని చెబుతూనే.. ఆయన కాలంలోని పరిస్థితులు వేరని చిన్మయి గుర్తు చేసింది.

చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆమె అభిప్రాయపడింది. పెద్దలు ఇండస్ట్రీలోని ఈ చీకటి కోణాలను చూడలేకపోవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు.. అంత మాత్రాన సమస్య లేనట్లు కాదని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీనియర్లకు ఉన్న మర్యాద, ప్రస్తుతం కొత్తగా వచ్చే అమ్మాయిలకు దక్కడం లేదని ఆమె ఆవేదన. మీటూ ఉద్యమం ద్వారా ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన చిన్మయి.. మరోసారి మెగాస్టార్ వ్యాఖ్యలను విభేదించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పని ప్రదేశంలో మహిళల భద్రత, గౌరవం గురించి ఆమె లేవనెత్తిన ప్రశ్నలు ఆలోచించదగినవి. కేవలం బాధితులు మంచిగా ఉంటే సరిపోదని, వేధించే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆమె ట్వీట్స్ సారాంశం. అగ్ర హీరోలు సైతం కాస్టింగ్ కౌచ్ ఉనికిని గుర్తించి.. దాని నివారణకు చొరవ చూపాలని నెటిజన్లు కూడా చిన్మయికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.