ఓడియమ్మా జీవితం.. బాక్సాఫీస్ బాద్‌షా ధురంధర్.. సాధించిన 10 సంచలన రికార్డులివే..!

గత 50 రోజులుగా ధురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఈ రోజుల్లో సినిమా 20 రోజులు ఆడటమే గగనం అనుకుంటుంటే..

  • Written By:
  • Updated On - January 24, 2026 / 03:04 PM IST

గత 50 రోజులుగా ధురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఈ రోజుల్లో సినిమా 20 రోజులు ఆడటమే గగనం అనుకుంటుంటే.. 50 రోజులుగా ఈ చిత్రం థియెట్రికల్ షేర్ తెస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. కంటెంట్ బలంగా ఉంటే సినిమా ఎంత బలంగా ఆడియన్స్‌ మనసులోకి దూసుకెళ్లిపోతుందో చెప్పడానికి ధురంధర్ విజయమే ప్రత్యక్ష నిదర్శనం. 2025 చివర్లో బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సినిమా ఒక సునామీలా విరుచుకుపడింది. ఈ చిత్రం ఏకంగా 1330 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. గతేడాది అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో భారీ అంచనాల మధ్య వచ్చిన కాంతార చాప్టర్ 1ను ఏకంగా 550 కోట్లకు పైగా మార్జిన్‌తో వెనక్కి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంత భారీ బడ్జెట్‌తో వచ్చి అత్యధిక రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ సాధించిన చిత్రంగా కూడా నిలిచింది ధురంధర్. హిందీ చిత్ర పరిశ్రమలో ధురంధర్ సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు.

ఇది 882 కోట్లకు పైగా వసూలు చేసి, ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో పుష్ప 2: ది రూల్ పేరు మీదున్న 830 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా 600, 700 మరియు 800 కోట్ల నెట్ వసూళ్ల మైలురాళ్లను దాటిన ఏకైక చిత్రంగా అవతరించింది. సాధారణంగా A సర్టిఫికెట్ ఉన్న సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఆదరణ తక్కువగా ఉంటుందనే అపోహను ధురంధర్ సినిమా పటాపంచలు చేసింది. యానిమల్ సినిమా సాధించిన 900 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రికార్డును బద్దలు కొట్టి.. అత్యధిక వసూళ్లు సాధించిన A రేటెడ్ చిత్రంగా ధురంధర్ నిలిచింది. కేవలం 17 రోజుల్లోనే 500 కోట్ల హిందీ నెట్ వసూళ్లను సాధించి.. షారుఖ్ ఖాన్ జవాన్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా జోరు కేవలం మొదటి వారంకే పరిమితం కాలేదు. లాంగ్ రన్‌లో కూడా అద్భుతమైన స్టామినాను ప్రదర్శిస్తూ… 2, 3, 4, 5 మరియు 6వ వారాల్లో భారతదేశంలోనే ఆల్ టైమ్ హయ్యెస్ట్ వసూళ్లను రాబట్టింది.

ఇక్కడ కూడా పుష్ప 2 రికార్డులను తిరగరాసింది ధురంధర్. హిందీ నెట్ కలెక్షన్లలో అత్యధిక రోజులు 10 మరియు 20 కోట్ల మార్కును దాటిన సినిమాగా కూడా ఇది రికార్డు సృష్టించింది. దాదాపు 30 రోజుల పాటు ప్రతీరోజు కనీసం 10 నుంచి 20 కోట్లకు మధ్యలో, అంతకంటే ఎక్కువగా వసూలు చేసింది ధురంధర్. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే నార్త్ అమెరికాలో 21 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. 9 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న బాహుబలి 2 రికార్డును అధిగమించింది. బాహుబలి 2 తర్వాత 20 మిలియన్స్ దాటిన రెండో ఇండియన్ సినిమాగా ధురంధర్ కొత్త చరిత్ర రాసింది. అన్నింటికంటే ముఖ్యంగా కేవలం ఒకే భాషలో 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ధురంధర్ నిలిచి.. ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా రికార్డులు ధురంధర్ పేరు మీదున్నాయి. మార్చి 19న ఈ సినిమా పార్ట్ 2 విడుదల కానుంది.. అది ఏకంగా 2000 కోట్లు వసూలు చేసి ఆల్ టైమ్ ఇండియన్ నెంబర్ 1గా నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..!