గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ దూకుడు చూసిన ఎవరికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకుని కానీ, అమెరికా వెనక్కి తగ్గదు అనిపించే ఉంటుంది. ట్రంప్ ఆ ప్రయత్నాలే చేశారు కూడా. డానిష్ ప్రభుత్వంపై బెదిరింపులకి దిగారు. గ్రీన్‌లాండ్ కోసం బల ప్రయోగానికీ వెనుకాడేది లేదన్నారు. డెన్మార్క్‌కు మద్దతిచ్చిన పశ్చాత్య దేశాలపైనా ఒత్తిళ్లు తెచ్చారు. ఆఖరికి తన ఫేవరెట్ టారిఫ్‌లనూ సంధించారు. డెన్మార్క్ సహా ఎనిమిది యూరోపియన్ దేశాలపై 10శాతం సుంకాలు విధించడమే కాక.. వాటిని 25శాతానికి పెంచుతాననీ బెదిరించాడు. కానీ, అమెరికా అధ్యక్షుడు సడెన్‌గా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. దావోస్ వేదికగా గ్రీన్‌లాండ్ స్వాధీనానికి బలప్రయోగం చేయబోమని ప్రకటించిన ట్రంప్.. యూరోపియన్ దేశాలపై సుంకాల నిర్ణయంపైనా వెనక్కి తగ్గారు. కానీ, సడెన్‌గా ట్రంప్‌లో ఈ మార్పు ఎందుకొచ్చింది? ట్రంప్ లెక్క ఎక్కడ తప్పింది? టాప్ స్టోరీలో చూద్దాం..
గ్రీన్‌లాండ్ కేరాఫ్‌గా అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య దూరం పెరిగిన వేళ ట్రంప్ చేసిన ప్రకటన ఇదే. “నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో చాలా ఫలప్రదమైన చర్చలు జరిగాయి. గ్రీన్‌లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి ఫ్రేమ్‌వర్క్ రూపొందించాం. ఇది కార్యరూపం దాల్చితే అమెరికాతో పాటు నాటో మిత్ర దేశాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సుంకాలపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన టారిఫ్‌లని విధించడం లేదు.” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లోనే గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని ప్రస్తావించారు. గోల్డెన్ డోమ్ నిర్మాణం పైనా చర్చలు కొనసాగుతున్నాయనీ.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్‌లు దీనికి సంబంధించిన కీలక చర్చలు జరుపుతున్నారని ట్రంప్ తెలిపారు. ఐతే, ఈ ప్రకటన వెనుక చాలా పెద్ద కథే నడిచింది. అమెరికాకు రియాలిటీ ఏంటో తెలిసొచ్చేలా చేసిందీ అదే.
ఈయూ దేశాలపై సుంకాలు విధించడం లేదు అని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల ముందు యూరోపియన్ పార్లమెంట్ నుంచి వచ్చిన ప్రకటనే ఇది. అమెరికాతో జరగాల్సిన వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే సుమారు 108 బిలియన్ల విలువైన అమెరికా వస్తువులపై కౌంటర్ టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు. ఆ వెంటనే అమెరికా స్టాక్ మార్కెట్లు రివర్స్ గేర్ వేయడం మొదలైంది. కథ ఇక్కడితో అయిపోలేదు.. దావోస్ వేదికగా అగ్రరాజ్యం అయితే ఏంటి అంటూ ఎదురుదాడికి దిగాయి. ప్రపంచ ఎకానమిక్ ఫోరమ్ సాక్షిగా ట్రంప్ మీదున్న కోపాన్నంతా చూపించారు యూరోపియన్ లీడర్లు. అమెరికా ఆధిపత్య ధోరణి కారణంగా ప్రపంచం విచ్ఛిన్నం అవుతోందని, ఇక ఆ దేశంతో కలిసి నడిచే రోజులు పోయాయని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పష్టం చేశారు. “శక్తివంతమైన దేశాలు ఏం కావాలంటే అది చేస్తున్నాయి. బలహీనమైన దేశాలు నష్టపోతున్నాయి. ఈ పద్ధతి ఇక మీదట కొనసాగదు అని కార్నీ అన్నారు. తామ స్వతంత్ర దేశంగా నిలబడతామని బల్లగుద్ది మరీ చెప్పారు. గ్రీన్ లాండ్, డెన్మార్క్‌కు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని, గ్రీన్ లాండ్ భవిష్యత్తును నిర్ణయించుకునే హక్కు ఆ ప్రాంతానికి మాత్రమే ఉందని కార్నీ ఉద్ఘాటించారు.
మరోవైపు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సైతం ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా కొత్త వలసవాద సామ్రాజ్య విధానాన్ని అనుసరిస్తోందని, దీనివల్ల దశాబ్దాల భాగస్వామ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మనం బెదిరించేవాళ్లకు, క్రూరమైన చట్టాలకే గౌరవం ఇస్తున్నాం అంటూ ప్రస్తుత యూరప్ విధానాలను తూర్పారబట్టారు. సుంకాల ద్వారా యూరోపియన్ దేశాలను అణిచివేయాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ట్రేడ్ బజూకాకు సిద్ధం కావాలని ఈయూ కూటమికి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ చట్టం బలవంతుల అదుపు ఆజ్ఞల్లో పడి కొట్టుకుపోతోందని ఆరోపించారు. వీరిద్దరే కాదు.. బ్రిటన్ ఎంపీ కీర్ స్టార్మర్, డెన్మార్క్ ప్రధాని సహా చాలా మంది యూరోపియన్ నేతలు ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ఒక్కొక్కరినీ కాదు వందమందిని ఒకేసారి రమ్మను అనే రేంజ్‌లో 10శాతం కాదు 100శాతం సుంకాలు విధించినా ఎదిరిస్తామని ఫైర్ అయ్యారు.
గ్రీన్‌లాండ్ విషయంలో తాను ఏం చేసినా చెల్లుతుందని ట్రంప్ భావించాడు. యూరోపియన్ దేశాలకు తామే దిక్కనీ, అగ్రరాజ్యమే లేకపోతే అవి మనుగడ సాగించలేవనీ లెక్కలు కట్టారు. నిజమే.. అమెరికా మద్దతు లేకపోతే యూరోపియన్ దేశాల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ముఖ్యంగా రక్షణ రంగంలో అమెరికా మద్దతు వాటికి చాలా కీలకం. అందుకే, తన ఆదేశాలనే ఈయూ దేశాలు ఫాలో అవుతాయనుకున్నాడు. కానీ, ఈయూ దేశాలు ట్రంప్‌కు లొంగిపోలేదు. అమెరికాకు ప్రతయామ్నాయాలపై దృష్టి పెట్టాయి. భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కొలిక్కి తెచ్చాయి. తద్వారా అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటామనే సంకేతాలు వాషింగ్టన్‌కు పంపించాయి.అంతేకాదు, తిరిగి అమెరికాకే చెక్ పెట్టే నిర్ణయాలు తీసుకున్నాయి. అగ్రరాజ్యంతో ట్రేడ్ డీల్ ఆపేసి, రివర్స్ టారిఫ్స్‌లకు సిద్ధపడ్డాయి. పరిస్థితులు తిరిగి తమ దేశానికే వ్యతిరేకంగా మారుతున్నాయని గ్రహించిన డొనాల్డ్ ట్రంప్, గ్రీన్‌లాండ్‌పై బలప్రయోగం చేయబోమనీ, 10శాతం సుంకాల విధింపును నిలిపిస్తున్నట్టు ప్రకటించారు. ఒక రకంగా ఇది అమెరికా దారుణమైన వైఫల్యమే.