Vijay Antony: బిచ్చగాడు హీరో ఇంట తీవ్ర విషాదం.. ఉరి వేసుకున్న పెద్ద కుమార్తె మీరా

ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన పెద్ద కూతురు మీరా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

Post Published By: Srikar Creator
Updated : 19 September 2023, 9:54 AM IST

విజయ్ ఆంటోని ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరి నోట వినిపించే మాట బిచ్చగాడు. ఈయన ఇంట్లో తాజాగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హీరో, దర్శకుడు, నిర్మాత గా రాణిస్తున్న విజయ్ ఆంటోని పెద్ద కూతురు మీరా ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ షాక్ కి గురిచేస్తోంది.

మీరా వయసు 16 సంవత్సరాలు. ఆంటోని చర్చ్ పార్క్ స్కూల్ లో 12వ తరగతి చదువుతోంది. చెన్నైలోని ఆళ్వార్ పేట డీడీకే రోడ్డు సమీపంలోని ఇంట్లో కుటుంబసమేతంగా అందరూ అక్కడే కలిసి ఉంటున్నారు. అదే ఇంట్లో ఇవాళ తెల్లవారు ఝామున మీరా తన రూంలో ఉరి వేసుకొని సూసైడ్ కి పాల్పడ్డారు. రోజూలాగానే మీరా గదిలోకి వెళ్ళిన సభ్యులు అక్కడి పరిస్థితి చూసి ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గమధ్యమంలోనే మీరా ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె తండ్రి విజయ్ ఆంటోని వ్యక్తిగత పనిపై బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈయన ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు స్థానికులు.

విజయ్ 2006లో ఫాతిమా అనే యువతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరూ కుమార్తెలు పెద్ద అమ్మాయి పేరు మీరా ఆంటోని, చిన్న కూతురు పేరు లారా ఆంటోని. మీరా ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రదాన కారణం చదువు ఒత్తిడి అని ప్రాథమికంగా భావిస్తున్నారు.  అయితే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అటు తమిళనాటే కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ తనదైన ముద్రవేసుకున్నారు విజయ్ ఆంటోని. ఇటీవలె బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలాగే సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తిగా మంచి పేరున్న ఈయన కుటుంబంలో తాజా ఘటనతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న తెలుగు, తమిళ సినీ ప్రముఖులు ఫోన్ చేసి తమ సంతాపం తెలియజేస్తున్నారు.

T.V.SRIKAR

Published : 
  • 19 September 2023, 9:54 AM IST