Top Story: చెరిగిపోని జ్ఞాపకం… ప్రత్యూష కేసులో ఇప్పటికీ తీరని అనుమానాలు ఎన్నో…!

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.

Post Published By: dialnews
Updated : 18 February 2026, 9:37 AM IST

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ప్రత్యూష ప్రియుడు సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేయడంతో జైలు శిక్షను రెండేళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.ఈ కేసులో సుప్రీంకోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. గత ఏడాది నవంబర్‌లో విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు, తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత తీర్పును వెలువరిస్తూ, సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది. 2002లో తాను, ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించామని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థరెడ్డి చెబుతున్నారు. తన కూతురు ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డి కారణమని సరోజిని ఆరోపించారు.

భువనగిరికి చెందిన ప్రత్యూషది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక టీవీ రియాలిటీ షో నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. షార్ట్ టైంలోనే సెల్యులాయిడ్‌పై ఒక వెలుగు వెలిగింది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. తెలుగు తెరపై తెలుగు ముఖాలే కరువైన ఆ టైంలో.. ప్రత్యూష ఫేస్ కట్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్టయింది. శ్రీరాములయ్య, సముద్రం, స్నేహమంటే ఇదేరా లాంటి సినిమాలతో బిజీ అయిపోయింది. మధ్యలో తమిళ సినిమాల్లో చేసింది.నెక్స్ట్‌ డోర్ గర్ల్ లాగా ఉంటే ప్రత్యూష కెరీర్‌ రాయుడు సినిమా ద్వారా 1998లో మొదలై.. 2002లో కలుసుకోవాలని మూవీతో ఎండ్ అయింది.

2001లో ఏకంగా ఐదు సినిమాలతో కెరీర్‌ పీక్స్‌కి వెళ్లిన ప్రత్యూష్‌.. జర్నీ ఒక్కసారిగా ఆగిపోయింది.అది 2002, ఫిబ్రవరి 23.. సాయంత్రం! ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందన్న వార్త ఫిలిం ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. ప్రత్యూష, ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి కలిసి ఫిబ్రవరి 23 సాయంత్రం కూల్ డ్రింకులో పురుగుల మందు కలిపి తాగారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా ప్రత్యూష అప్పటికే చనిపోయింది. సిద్ధార్థ్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీబీఐ విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, సిద్ధార్థ్ కుటుంబం అంగీకరించకపోవడంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేశారని దర్యాప్తులో తేలింది.

ప్రత్యూష మృతిపై అనేక అనుమానాలు వచ్చాయి. రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పోస్టుమార్టం చేసిన వైద్యుడేమో.. గొంతు నులిమిన ఆనవాళ్లున్నాయని, లైంగిక దాడి జరిగిందని పేర్కొనడం అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపింది. ప్రత్యూష తల్లి ఇది ముమ్మాటికీ హత్యే అని ఆరోపించారు. ఈ కేసులో అప్పటి హోంమంత్రి కుమారుడి పేరు వినిపించడంతో రాజకీయజోక్యం ఉందన్న ప్రచారమూ జరిగింది. ఇలాంటి ట్విస్టులతో ప్రత్యూష కేసు మిస్టరీగా మారి, సంచలనానికి దారితీసింది. చివరకు కేసును సీబీఐకి అప్పగిస్తే, హత్య కోణాన్ని కొట్టివేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుగా మాత్రమే నమోదు చేసింది.

ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరంకింద సిద్ధార్థ్ రెడ్డికి ట్రయల్ కోర్టు 5 ఏళ్ల జైలుశిక్ష ఖరారు చేసింది. తర్వాత శిక్షను 2 సంవత్సరాలకు కుదిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. భారీగా జరిమానా వేసింది.హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సిద్ధార్ధ్ శిక్షను పెంచాలంటూ ఆమె పిటిషన్ వేశారు. మరోవైపు శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థ్ అప్పీల్‌ చేశారు. ఈ రెండు పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. ఇవాళ వెలువరించనుంది.రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ కేసు చుట్టూ అనేక ప్రశ్నలు సమాధానం లేకుండా మిగిలిపోయాయి. ఒకటి- ఇది హత్యా? లేక ఆత్మహత్యా?.. రెండు- పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌ ఏమైనా ఉందా? మూడు-లైంగిక దాడి జరిగిందా? నాలుగు- వాళ్ల పెళ్లికి ఎవరు నిరాకరించారు? ఐదు- ఒకరు చనిపోయి.. ఒకరు బతకడమేంటి? ఇలా అనేక ప్రశ్నలు ఈ కేసు చుట్టూ తిరిగాయి.

ఈ కోణంలోనే ప్రత్యూష తల్లి న్యాయపోరాటం చేసి.. ఆ కేసుని లైవ్‌లో ఉంచారు.సుప్రీంకోర్టు తీర్పుతో 24 ఏళ్ల తర్వాత ప్రత్యూష మరణం కేసు ముగిసింది. కానీ ఆ మరణం వెనక మిస్టరీ ఇప్పటికీ అలాగే ఉంది. న్యాయస్థానాలు ప్రత్యూష ది హత్య కాదని ఆత్మహత్య అని చెప్తున్నప్పటికీ.... ఆ తల్లి ఆవేదన ఇప్పటికీ ఎన్నో అనుమానాలు సజీవంగానే ఉంచింది. భవిష్యత్తును ఒక హీరోయిన్.... చుట్టూ ఉన్న వ్యక్తుల వలన... తన గమ్యాన్ని లక్ష్యాన్ని మర్చిపోయింది. చివరికి నిర్జీవంగా మారిపోయింది. కారణం ఏదైనా కావచ్చు కానీ ప్రత్యూష కద తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

Published : 
  • 18 February 2026, 9:37 AM IST