ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ ప్లానింగ్ ను పూర్తిగా మార్చేశాడు. పుష్ప: ది రైజ్ తర్వాత పాన్ ఇండియా క్రేజ్ అయితే వచ్చింది కానీ.. తెలియకుండానే రెండు భాగాల మధ్య దాదాపు ఐదేళ్ల భారీ గ్యాప్ వచ్చేసింది. ఒక స్టార్ హీరో కెరీర్ లో ఇంత గ్యాప్ రావడం మంచిది కాదని గ్రహించిన బన్నీ, ఇకపై సినిమా సినిమాకు మధ్య ఏడాదికి మించి గ్యాప్ ఉండకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ జెట్ స్పీడ్ లో సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ నిర్ణయంతోనే బన్నీ వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న భారీ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో అట్లీ మార్క్ మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నాడు.
మరోవైపు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో సినిమా కూడా అధికారికంగా ఓకే అయిపోయింది. ఈ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో విపరీతమైన హైప్ ఉంది. మార్చి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం 120 రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా లోకేష్ పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు. అంటే అట్లీ సినిమా షూటింగ్ జరుగుతుండగానే, లోకేష్ సినిమాను కూడా బన్నీ సమాంతరంగా పూర్తి చేయనున్నాడన్నమాట. ఇవి మాత్రమే కాకుండా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఇది కార్తికేయ స్వామి బ్యాక్ డ్రాప్ లో సాగే భారీ మైథలాజికల్ సినిమా అని టాక్. అలాగే సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 3 ది రోర్ కూడా భవిష్యత్తులో రానుంది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి.
మొత్తానికి బన్నీ లైనప్ చూస్తుంటే మతిపోతోంది. 2027 నుంచి 2029 మధ్యలో అల్లు అర్జున్ నుంచి ఏకంగా నాలుగు భారీ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. గడిచిన ఐదేళ్లలో ఒక్క సినిమా కోసమే ఎదురుచూసిన ఫ్యాన్స్ కి, రాబోయే మూడేళ్ళలో బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాడు. ఐకాన్ స్టార్ స్పీడ్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో బిజినెస్ అంతా కలిపితే దాదాపు 8,000 కోట్లు. ఇందులో సగం అంచనాలు అందుకున్న కూడా బన్నీ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. మరి చూడాలి ఏం జరగబోతుందో.