టీ20 ప్రపంచకప్ కు ఇంకా 10 రోజులే మిగిలిఉంది. ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న వరల్డ్ కప్ కు సంబంధించి గత కొన్ని రోజులుగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి వైదొలగడంతో స్కాట్లాండ్ ను రీప్లేస్ చేసారు. అయితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు , ఐసీసీ మధ్య వ్యవహారం మరింత చర్చకు దారితీసింది. భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని.. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడించాలని బీసీబీ ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, భారత్‌లో బంగ్లా జట్టుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పిన ఐసీసీ.. తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీబీకి గడువు ఇచ్చింది. అయితే, బీసీబీ మాత్రం మొండిపట్టు పట్టింది. తమ ప్రభుత్వం చెప్పినట్లుగానే తమ ఆటగాళ్లను భారత్‌కు పంపబోమని స్పష్టం చేసింది.
ఇందుకు స్పందనగా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేరుస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.ఈ ఎపిసోడ్ మొత్తంలో బీసీబీ కంటే కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బాగా ఓవరాక్షన్ చేసింది. బంగ్లాదేశ్‌కు ఐసీసీ అన్యాయం చేసిందంటూ.. బోర్డు మొత్తం ఒకవైపు ఉంటే.. పాక్ మాత్రం బంగ్లాకు అనుకూలంగా ఓటు వేసింది. అంతేకాదు బంగ్లాదేశ్‌ను ఆడించకపోతే తామూ టోర్నీ బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగింది. నిజానికి ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం.. పాక్‌కు ఇప్పటికే తటస్థ వేదికగా శ్రీలంకను ఏర్పాటు చేసింది ఐసీసీ. అయినప్పటికీ బంగ్లాదేశ్‌కు వత్తాసు పలుకుతూ భారత్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని పాక్ బోర్డుపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తమ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం..
ఈ శుక్రవారం లేదంటే వచ్చే సోమవారం నాటికి టోర్నీలో ఆడే విషయంపై నిర్ణయం వెల్లడిస్తామంటూ పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ట్వీట్ చేశాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ పాక్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ స్థానంలో బంగ్లాదేశ్ రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ టోర్నీ నుంచి వైదొలగాలని భావిస్తే.. గ్రూప్-ఎలో ఆ జట్టు స్థానాన్ని బంగ్లాదేశ్ భర్తీ చేసే అవకాశం ఉంది. పాక్ తప్పుకొంటే… బీసీబీ ముందు నుంచి కోరినట్లుగా పాక్ స్థానంలో బంగ్లాదేశ్ శ్రీలంకలో తమ మ్యాచ్‌లు ఆడేందుకు వీలు కలుగుతుంది. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని సమస్యలు తలెత్తినా అంతిమంగా ఓ పరిష్కారం అయితే దొరుకుతుందని ఐసీసీ సన్నిహిత వర్గాలు విశ్లేషించాయి.