చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన కొద్ది రోజులకే న్యూజిలాండ్ దిగ్గజం స్టీఫెన్ ఫ్లెమింగ్ కి సరికొత్త ఆఫర్ వచ్చింది. ఇంగ్లాండ్ పురుషుల టెస్ట్ జట్టు హెడ్ కోచ్‌గా ఆయన నియామకం దాదాపు ఖాయమైంది. ప్రస్తుత కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో ఫ్లెమింగ్ ఈ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఆండీ ఫ్లవర్ ఈ రేసు నుంచి తప్పుకోవడంతో రిచర్డ్ డాసన్, జోనాథన్ ట్రాట్, టామ్ మూడీలను ఇంటర్వ్యూ చేసిన ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చివరకు ఫ్లెమింగ్ వైపే మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది. ఫ్లెమింగ్ ఎప్పటి నుంచి బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ అసిస్టెంట్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ పాకిస్తాన్ సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తే, డిసెంబర్ 17వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ నుంచి ఫ్లెమింగ్ పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది.
బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. వైస్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ రేసులో ఉన్నప్పటికీ, మాజీ కెప్టెన్ జో రూట్‌కు మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించడానికి ఈసీబీ సుముఖంగా ఉన్నట్టు సమాచారం.ఈ నియామకం కేవలం టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కానుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో (వన్డే, టీ20 బ్రెండన్ మెకల్లమ్ హెడ్ కోచ్‌గా కొనసాగుతాడు. 2022లో కేవలం టెస్ట్ కోచ్‌గా ప్రయాణం స్టార్ట్ చేసిన మెకల్లమ్, 2025లో అన్ని ఫార్మాట్ల బాధ్యతలు చేపట్టగా, ఇప్పుడు మళ్లీ రెడ్ బాల్, వైట్ బాల్ కోచింగ్‌ను ఈసీబీ వేరు చేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో స్టీఫెన్ ఫ్లెమింగ్ కెప్టెన్సీలోనే బ్రెండన్ మెకల్లమ్ న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేశాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు పేలవ ఫామ్ తో సతమతమవుతోంది. మొదటి 3 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయిన ఇంగ్లాండ్, ప్రస్తుత సైకిల్ లోనూ 7వ స్థానంలో కొనసాగుతుంది. ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో యాషెస్‌లో 1-4తో, స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 1-2తో సిరీస్ ఓడిపోయిన ఇంగ్లాండ్‌ను మళ్లీ గాడిన పెట్టడం ఫ్లెమింగ్ ముందున్న అతిపెద్ద సవాలుగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కోచ్ గా ఫ్లెమింగ్ కు మంచి రికార్డుంది. 2009 నుంచి 2026 సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన ఫ్లెమింగ్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కోచ్‌గా నిలిచాడు.