విశాఖ వేదికగా ధనాధన్… భారత్ తుది జట్టు ఇదే

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. మరో పోరుకు సిద్దమైంది.

  • Written By:
  • Publish Date - January 27, 2026 / 05:30 PM IST

న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకున్న టీమిండియా.. మరో పోరుకు సిద్దమైంది. బుధవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న నాలుగో టీ20‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకోవడంతో ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తుది జట్టులో ఎవరిపై వేటు పడుతుంది? ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో మూడు వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన జస్‌ప్రీత్ బుమ్రాకు విశాఖ టీ20 నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. మెగా టోర్నీకి ముందు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాను ఈ మ్యాచ్ నుంచి పక్కనపెట్టనున్నారు. అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ బరిలోకి దిగనున్నాడు. బుమ్రాను కొనసాగించాలనుకుంటే హర్షిత్ రాణాపై వేటు పడుతుంది.

మూడో టీ20కి దూరంగా ఉంచిన వరుణ్ చక్రవర్తీ బరిలోకి దిగితే రవి బిష్ణోయ్ ఉద్వాసనకు గురవుతాడు. అయితే మూడో టీ20లో బిష్ణోయ్ రెండు వికెట్లతో సత్తా చాటాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా అతను మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు. వాషింగ్టన్ సుందర్ గాయపడిన నేపథ్యంలో టీమ్‌మేనేజ్‌మెంట్ బిష్ణోయ్‌ను అతనికి బ్యాకప్‌గా సిద్దం చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే నాలుగో టీ20లోనూ అతన్ని కొనసాగించే అవకాశం ఉంది. అవసరమైతే వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్‌లో ఒకరికి విశ్రాంతి ఇచ్చి మరీ బిష్ణోయ్‌ను బరిలోకి దించవచ్చు.

వరుసగా మూడు టీ20ల్లో విఫలమైన సంజూ శాంసన్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ఆఖరి అవకాశంగా నాలుగో టీ20లో ఆడించవచ్చు. అదే జరిగితే శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి నిరాశే ఎదురు కానుంది. చివరి రెండు టీ20 మ్యాచ్‌లకు తిలక్ వర్మ దూరమవ్వడంతో అయ్యర్‌ను జట్టులో కొనసాగించారు. తిలక్ వర్మకు బ్యాకప్‌గా అయ్యర్‌ను రెడీ చేయాలనుకుంటే నాలుగో టీ20లో అతను ఆడవచ్చు. అప్పుడు సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్‌లో ఒకర్ని తప్పించవచ్చు. అవసరమైతే అభిషేక్ శర్మకు రెస్ట్ ఇవ్వవచ్చు. సిరీస్ గెలిచిన నేపథ్యంలో చివరి రెండు మ్యాచ్‌లను పూర్తిగా ప్రయోగాలకు వాడుకునే ఛాన్స్ ఉంది.