కివీస్ పై మళ్లీ అభిషేకాస్త్రం, టీ ట్వంటీ సిరీస్ భారత్ కైవసం

వన్డే సిరీస్ పరాభవానికి భారత్ అసలు సిసలు ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు అదిరిపోయే సిరీస్ విజయాన్ని అందుకుంది.

  • Written By:
  • Publish Date - January 26, 2026 / 10:47 AM IST

వన్డే సిరీస్ పరాభవానికి భారత్ అసలు సిసలు ప్రతీకారం తీర్చుకుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు అదిరిపోయే సిరీస్ విజయాన్ని అందుకుంది. కీలక ఆటగాళ్లు ఫామ్ అందుకున్న వేళ.. అభిషేక్ శర్మ విధ్వంసం కొనసాగించినవేళ.. సూర్యకుమార్ మరో ఫిఫ్టీ కొట్టిన వేళ.. కివీస్‌పై టీ20 సిరీస్ గెలుచుకుంది.మరో 2 మ్యాచ్ లు మిగిలుండగానే సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు ఆరంభంలోనే కీలక వికెట్లు చేజార్చుకుంది.

పవర్ ప్లేలోనూ ముగ్గురు ఔటయ్యారు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ , చాప్ మన్ కాసేపు పోరాడడంతో కోలుకుంది. చివర్లో మిఛెల్ శాంట్నర్ మెరుపులతో కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు చేసింది. రెండో వన్డేకు రెస్ట్ తీసుకుని ఈ మ్యాచ్ కు రీఎంట్రీ ఇచ్చిన బుమ్రా, హర్షిత్ రాణా, పాండ్యా కూడా అదరగొట్టారు. బుమ్రా తన స్పెల్ లో కేవలం 17 పరుగులే ఇట్టి 3 కీలక వికెట్లు తీశాడు. రవి బిష్ణోయ్ 2, పాండ్యా, 2 , రాణా 1 వికెట్ తీసాడు.

ఛేజింగ్ లో తొలి బంతికే భారత్ కు షాక్ తలిగింది. సంజూ శాంసన్ డకౌటై మరోసారి నిరాశపరిచాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడాడు. అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్ కు 53 పరుగులు జోడించాడు. ఇషాన్ కిషన్ 28 పరుగులకు ఔటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ కివీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డ ఈ యువ ఓపెనర్ కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. అటు సూర్యకుమార్ యాదవ్ కూడా తన ఫామ్ కొనసాగించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. ఈ గెలుపుతో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్టయింది.